‘ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులందరికి మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఇంతలో అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడనేది తెలియాలంటే మా ‘ఇట్లు’ సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు దర్శకుడు రోశి రెడ్డి పందిళ్ళపల్లి. అమీర్, శిరీష, అశ్విత హీరోహీరోయిన్లుగా రోశి రెడ్డి పందిళ్ళపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు’. శ్రీజా ఆర్ట్స్ పతాకంపై రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల, డా. రఘు, డా. శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్ నివ్వగా, శ్రీమతి వాణి(ఎం ఎఫ్ టి ఐ) కెమెరా స్విచాన్ చేశారు. మద్దూరి వెంకట కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర దర్శకుడు రోశి రెడ్డి మాట్లాడుతూ, ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్నాను. రెండు, మూడు లఘు చిత్రాలను రూపొందించాను. ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నా. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ అంశాల మేళవింపుగా సినిమాని రూపొందిస్తున్నా. ‘ఇట్లు’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సస్పెన్స్. దర్శకుడిగా నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, అలాగే మా గురువులు మద్దూరి వెంకట కృష్ణమోహన్, నారాయణరావులకు ధన్యవాదాలు’ అని అన్నారు.
నటుడు నారాయణరావు మాట్లాడుతూ, ‘నేను, కృష్ణమోహన్ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా పనిచేశాం. మా శిష్యుడు ఈ సినిమాని రూపొందించడం ఆనందంగా ఉంది. కొత్తవారిని తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఈ టీమ్‌ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
మద్దూరి వెంకట కృష్ణ మోహన్ చెబుతూ, ‘రోశి రెడ్డి తన స్నేహితుల సహకారంతో ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’ అని చెప్పారు.
నిర్మాత రాజ గౌడ్ మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌లో ఇది మొదటి చిత్రం. రోశి రెడ్డి గత 12ఏండ్లుగా తెలుసు. ఆయన ఈ కథని నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి నిర్మించేందుకు ముందుకు వచ్చాం’ అని తెలిపారు.
మరో నిర్మాత డా.రఘు మాట్లాడుతూ, సింగర్ అవ్వాలని డాక్టర్ అయ్యాను. కర్నాటక క్లాసికల్ సంగీతం నేర్చుకున్నా. ఈ సినిమాతో నిర్మాతగా మారడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పారు.
హీరో అమీర్ చెబుతూ, ‘హీరోగా నాకిది తొలి చిత్రం. ఇందులో యువ రైతు పాత్ర పోషిస్తున్నా’ అని అన్నారు.
హీరోయిన్ శిరీష మాట్లాడుతూ, ‘ఇందులో నేను పూజిత పాత్రలో కనిపిస్తా. కథానాయికగా తొలి చిత్రం. అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని తెలిపారు.
మరో హీరోయిన్ అశ్విత చెబుతూ, ‘ఇందులో మెడికో స్టూడెంట్‌గా నటిస్తున్నా. సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రఘు, మెట్టయ్య, రాజ గౌడ్, శ్రీరాములు , ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎర్రం వేణు, సినిమాటోగ్రఫీ: మల్లేష్ నాయుడు, పి.ఆర్.ఓ: కడలి రాంబాబు, మాటలు: మద్దూరి వెంకట కృష్ణమోహన్, నిర్మాతలు : రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల, డా. రఘు, డా. శ్రీరాములు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రోశి రెడ్డి పందిళ్లపల్లి