తాజాగా పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి ఉద్వేగపూరిత ప్రసంగం చేశాడు. ఆయన మాట్లాడుతూ, చిరంజీవి తెలుగు చిత్రసీమను ఏలుతాడని నేను ఎప్పుడో చెప్పాను. నా సినిమా వేడుకలకు ఎప్పుడు లైవ్ ఇవ్వరు. చిరంజీవి రావడం వల్ల మొదటిసారిగా లైవ్ ఇస్తున్నారు. ఆడియో వేడుకకు వస్తే సినిమా ప్రమోషన్‌కి ఉపయోగపడుతుందని మెగాస్టార్ చిరంజీవి గారిని అడిగిన వెంటనే ఆయన ఓకే చెప్పి వచ్చారు.
ప్రాణం ఖరీదు చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తే నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. చిరంజీవి, నూతన్‌ప్రసాద్, చంద్రమోహన్‌లను రాజమండ్రిలోని అప్సర లాడ్జిలో ఉంచారు. నాకు కూడా అందులోనే రూమ్ ఇస్తారని భావించాను. మంచి భోజనం దొరుకుతుందని ఆశ పడ్డాను. కానీ సీన్ రివర్స్ అయింది. నన్ను పాకశాలలో పడుకోమన్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఓ కుర్రాడు చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని, వాక్‌మెన్‌తో సెట్‌లోకి వచ్చారు. అతను ఎవరా అని చూస్తే చిరంజీవి. అతడిని అలాగే చూడగానే ఇండస్ట్రీని ఏలుతాడని నాకు అనిపించింది.
అదే రోజున ఆయనతో ఆ మాట చెప్పాను. చిరంజీవి గారు ‘థాంక్యూ నారాయణగారు’ అన్నారు. చిరంజీవి నా ఆడియో ఫంక్షన్‌కి రావడం నా పూర్వజన్మసుకృతం. అది నా అదృష్టం. అందుకే చిరంజీవికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు. ఈ వేడుకలో చిరంజీవి పాల్గొనడంతో పాటు పకోడి, జిలేబీ తినడం విశేషంగా అందరు చెప్పుకుంటున్నారు.