ఏ చిత్రానికైనా డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. పాతకాలం దర్శకులు ఏమి చెబితే స్టార్ హీరోలైనా వాటికి ఓకే చెప్పాల్సిందే. కానీ కాలం మారింది. దాసరి వంటి వారు లేరు. దీంతో వివాదాలను పరిష్కరించే మరో పెద్దమనిషి కనిపించడం లేదు. ఇది ఖచ్చితంగా దర్శకుల అవమానాలపై మౌనంగా ఉండాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తోంది. ఇటీవల క్రిష్ బాలీవుడ్‌లో ఝూన్సీలక్ష్మీభాయ్ వీరచరిత్రను ‘మణికర్ణిక’గా మొదలుపెట్టాడు. దాదాపు ఈ చిత్రానికి హీరో, హీరోయిన్, నిర్మాత అన్ని తానే అయిన కంగనారౌనత్ సినిమా మధ్యలో క్రిష్‌ని తీసి వేసి తీవ్ర అవమానానికి గురి చేసింది. ఆ విజయం మొత్తం తన ప్రమోషన్‌తో, నిర్మాతల, రచయిత విజయేంద్రప్రసాద్‌ల మద్దతుతో క్రిష్‌కి కనీస మర్యాద ఇవ్వలేదు.
ఇక తేజ విషయానికి వస్తే ఆయన బాలయ్యాస్, ఎన్టీఆర్ బయోపిక్‌కి మొదటి దర్శకుడు. కానీ ఈ చిత్రం క్యాస్టింగ్ కూడా పూర్తయిన తరుణంలో తేజ దీని నుంచి తప్పుకున్నాడు. పెద్దాయన ఎన్టీఆర్ బయోపిక్‌కి న్యాయం చేయలేక తప్పుకున్నానని తేజ చెప్పినా అది ఎవ్వరూ నమ్మరు. ఈ చిత్రం మొదటి పార్ట్‌లో సీనియర్ ఎన్టీఆర్ పాటలు, గట్రా అనవసరం అంశాలకు చోటిస్తే ఫీల్ పోతుందని భావించిన తేజ బాలయ్యతో క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చి తప్పుకున్నాడనేది వాస్తవం.
ఇక తాజాగా లారెన్స్ తనకు హిందీ రాకపోయినా బాలీవుడ్‌స్టార్ అక్షయ్‌కుమార్ బలవంతం మీద ‘కాంచన’ని హిందీలో ‘లక్ష్మీబాంబ్’ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అక్షయ్‌తో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. కానీ తన అనుమతి లేకుండా ఏకంగా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయడం లారెన్స్ అవమానంగా భావించాడు. ఈయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలిపినా ఇప్పటికీ నిర్మాతలు స్పందించకపోవడం గమనార్హం. అంతేకాదు.. లారెన్స్ అక్షయ్‌కుమార్ గురించి మాత్రం చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. కానీ దీనిని అక్షయ్ నుంచి కూడా స్పందన లేకపోవడం లారెన్స్‌ని మరింత బాధకి గురి చేసిందనే చెప్పాలి.
ఇక ఇటీవల మంచు విష్ణు నటించిన ‘ఓటర్’ చిత్రం రగడ కోర్టుల దాకా వెళ్తోంది. తనకి, తన కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి మంచు ఫ్యామిలీనే కారణమని దర్శకుడు కార్తీక్‌రెడ్డి వీడియో కూడా విడుదల చేశాడు. ఇక గతంలో కూడా బాలకృష్ణ-కోడిరామకృష్ణ-ఎస్.గోపాల్‌రెడ్డి చిత్రం, చిరంజీవి ‘బాగ్దాద్‌గజదొంగ’, రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో చిరు నటించాల్సిన చిత్రం నుంచి ‘ఆగడు’ సెట్స్‌లో తన అసిస్టెంట్ పట్ల దురుసుగా వ్యవహరించిన ప్రకాష్‌రాజ్‌పై శ్రీనువైట్ల కూడా కోపగించాడు. మొత్తానికి దాసరి లేని లోటు మిగిలిన వారికి కాకపోయినా దర్శకులకు మాత్రం ఇంకా తీరలేదనే చెప్పాలి.