తెలుగులో ఈమధ్య పలు చిత్రాల టైటిల్స్‌ని పాత చిత్రాల టైటిల్స్‌ని ఎంచుకుంటున్నారు. ఇక వారసత్వ హీరోల చిత్రాలలో వారి కుటుంబానికి చెందిన హీరోలు నటించిన చిత్రాలలోని పాత హిట్ సాంగ్స్‌ని రీమేక్ చేస్తున్నారు. ఇలా ఎక్కువగా చేస్తున్న వారిలో తమన్‌ని ముందుగా చెప్పుకోవాలి. ఈయన చేసిన పాత క్లాసిక్ సాంగ్స్ రీమిక్స్‌లు మరీ నాసిరకంగా ఉంటూ ఉన్నాయనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక పాత క్లాసిక్ సాంగ్స్ చిత్రీకరణ సమయంలో కూడా దర్శకులు విఫలమవుతున్నారనే అపవాదు ఉంది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హరీష్‌శంకర్ దర్శకత్వంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ‘వాల్మీకి’, తమిళంలో మంచి విజయం సాధించిన ‘జిగర్‌తాండా’కి ఇది రీమేక్. ఇందులో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్‌తేజ్ చేస్తుండగా, సిద్దార్ధ్ పాత్రను అధర్వ పోషిస్తున్నాడు. ఈమూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాల్సివుంది. కానీ తాజాగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ దేవిశ్రీ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఇది సంచలనంగా మారింది. దేవిశ్రీ ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి కారణం ఇది అంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
కానీ అంతర్గత సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ పాత క్లాసిక్ పాటని రీమిక్స్ చేసి పెట్టాలని దర్శకుడు హరీష్‌శంకర్ భావించాడట. ఈ రీమిక్స్ పాట సినిమాకి ఎంతో పెద్ద ప్లస్ అవుతుందని మాస్‌ని ఉర్రూతలూగిస్తుందని ఆయన అనుకున్నాడని, కానీ తాను రీమిక్స్ సాంగ్స్ చేయనని నియమం పెట్టుకున్నానని, తన పాలసీకి వ్యతిరేకంగా తాను ప్రవర్తించలేనని, కాబట్టి రీమిక్స్ చేయనని దేవిశ్రీ కుండబద్దలు కొట్టాడట. హరీష్‌శంకర్ దేవిశ్రీని ఈ విషయంలో ఎంత బలవంతం చేసినా దేవి తన మాట మీదనే నిలబడి చివరకు విధిలేక ఈ మూవీ నుంచి బయటకు వచ్చాడని సమాచారం. ప్రస్తుతం దేవిశ్రీ స్థానంలో మిక్కీజెమేయర్‌ని పెట్టుకున్నారు. మరి ఆయన ఈ రీమిక్స్ సాంగ్‌ని చేసి ఎంత వరకు మెప్పించగలడో వేచిచూడాల్సివుంది...!