సూర్య అంటే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాదండి... దర్శకుడు కం నటుడు ఎస్‌జె సూర్య. ఈయన కూడా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఈయన దర్శకత్వం వహించిన ‘వాలి, ఖుషీ’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. కానీ ఆ తర్వాత తీసిన ‘నాని, కొమరంపులి’ చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అలాంటి ఈయనకు ఈమధ్య మరలా పవన్‌కళ్యాణ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. కానీ అదే సమయంలో మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘స్పైడర్’ చిత్రంలో విలన్ పాత్ర రావడంతో పవన్ సినిమాని వదులుకుని మరీ ఆయన ‘స్పైడర్’లో నటించాడు. నిజానికి ఎస్.జె.సూర్య, కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇరైవి’ చిత్రంతో నటునిగా తన సత్తా చాటాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఈయన హీరోగా నటించిన మరో చిత్ర తమిళనాట విడుదలైంది. ఈయన నటించిన ‘మాన్‌స్టర్’ చిత్రం తాజాగా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌ని, విమర్శకుల ప్రశంసలను పొందుతోంది. ఈ మూవీని నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్‌గా ప్రియా భవాని శంకర్ నటించింది. మధ్యతరగతికి చెందిన వాడిగా, ఎలుకల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తిగా సూర్య నటన అద్భుతంగా ఉందనే పొగడ్తలు లభిస్తున్నాయి. నటునిగా ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్య సంచలనం సృష్టిస్తున్నాడంటే ఈ చిత్రంలో ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రం సూర్య కెరీర్‌లోనే మరుపురాని అద్భుత చిత్రం అంటున్నారు.
ఇక సూర్యకి నటునిగా దాదాపు అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి. మొత్తానికి సూర్య ఇక దర్శకత్వాన్ని పక్కనపెట్టి నటునిగా బిజీ అవ్వడం ఖాయం. అయితే దర్శకునిగా ఆయన్ను అభిమానించే వారు మాత్రం ఆయన నుంచి ఇక దర్శకునిగా ఏదైనా చిత్రం వస్తుందా? లేక రాదా? అని మథనపడుతుండటం విశేషం.