తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్‌లో నేచురల్‌స్టార్ నాని ఒకరు. ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా దర్శకుడిగా మారాలని వచ్చిన ఆయనకు హీరోగా చాన్స్‌లు రావడంతో దశ తిరిగింది. ఇక ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. వాస్తవానికి ఆయన అక్కినేని నాగార్జునతో కలిసి చేసిన ‘దేవదాస్’ చిత్రంలో నాగ్ కంటే నానికే మంచి మార్కులు పడ్డాయి. ఇక ఎడిట్ చేసిన ఆసుపత్రులు, డాక్టర్ల మీద నాని విరుచుకుపడే కీలక సన్నివేశాలు ఆ తర్వాత సోషల్‌మీడియాలో విడుదలై నానికి మంచి పేరుని తెచ్చాయి. ఇంత మంచి సీన్స్‌ని ఎందుకు ఎడిట్ చేశారు? అనే విషయంలో పలు వాదనలు వినవచ్చాయి. నాని పాత్ర నాగ్‌ని డామినేట్ చేయకుండా ఉండేందుకే ఇలా చేశారని కొందరు అంటుంటే.. కాదు.. కాదు.. నిడివి సమస్యల వల్ల వీటిని ఎడిట్ చేయాల్సివచ్చిందనే వాదన కూడా వినిపించింది. ఏదిఏమైనా ‘కృష్ణార్జునయుద్ధం’తో పోలిస్తే ‘దేవదాస్’ బెటర్ మూవీనే అని చెప్పాలి.
ఇక ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ చిత్రానికి కూడా మంచి లాభాలే వచ్చాయి. ఇదే సమయంలో నాని ఇంటెలిజెంట్ డైరెక్టర్ ‘ఇష్క్, మనం, 24, హలో’ వంటి చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌తో నాని ‘గ్యాంగ్‌లీడర్’ చేస్తున్నాడు. మరోవైపు దిల్‌రాజు నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబుతో కలిసి ‘వీ’ అనే చిత్రం రెడీగా ఉంది. తదుపరి చిత్రాల కోసం నాని కథలు వినే పనిలో ఉన్నాడు. ఇక ‘గ్యాంగ్‌లీడర్’ విషయానికి వస్తే దీనికి మొదటి నుంచి వివాదాలు ఎదురయ్యాయి. అశ్వనీదత్‌కి విక్రమ్ కె. కుమార్ ఓ చిత్రం చేయాల్సి ఉండటంతో.. చివరకు మైత్రి మూవీస్ సంస్థ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అద్భుతమైన విజయం సాధించిన ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌ని నాని సినిమాకి పెట్టడం మెగాభిమానులకు కోపం తెప్పించింది. ఇంతలో మరో చిన్న నిర్మాత ఈ టైటిల్‌ని తాను రిజిష్టర్ చేసుకున్నానని గొడవ చేశాడు. ఇన్ని అడ్డంకులు ఎదురైనా ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం రిలీజ్ డేట్‌ని మైత్రి మూవీ మేకర్స్‌సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈ మూవీని ఆగష్టు30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరోవైపు మైత్రి సంస్థ విజయ్ దేవరకొండ హీరోగా భరత్‌కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ చిత్రం చేస్తోంది. ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడింది. చివరకు జులై26న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ డేట్ కూడా అనుమానమే అనే వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా ఈ రెండు చిత్రాలకు నెల గ్యాప్ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని యూనిట్ భావిస్తోంది. ‘డియర్ కామ్రేడ్’ ఆలస్యం కావడాన్ని గుణపాఠంగా తీసుకున్న మైత్రి సంస్థ ఇకపై తమ చిత్రాల షూటింగ్, విడుదల విషయాలలో ఖచ్చితంగా ఉండాలని భావిస్తోంది. మొత్తానికి ఒకే సంస్థలో, అదీ నెల గడువులో వస్తున్న ఈ రెండు చిత్రాలలో విజయం విజయ్ దేవరకొండని వరిస్తుందా? లేక నానిని వరిస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది.