మాస్ దర్శకులు, కమర్షియల్ డైరెక్టర్ల కంటే క్రియేటివ్ దర్శకుల పని చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని క్రియేటివ్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ అందులో ఒకరు. కానీ క్రియేటివ్ దర్శకులకు అప్పుడప్పుడు బ్యాడ్ టైం బాగా రన్ అవుతూ ఉంటుంది. ఇది ది గ్రేట్ మణిరత్నంకే తప్పలేదు. ఇక ‘ఫిదా’కి ముందు శేఖర్ కమ్ముల, ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల ద్వారా క్రిష్, ‘హలో’ ద్వారా విక్రమ్ కె కుమార్‌లు నానా ఇబ్బందులు పడ్డారు.. పడుతున్నారు.
ఇక కృష్ణవంశీ విషయానికి వస్తే ఆయనకు శ్రీకాంత్ వందో చిత్రంగా దర్శకత్వం వహించిన ‘మహాత్మా’ మాత్రమే చివరి సక్సెస్. అయినా ఈ చిత్రం అంత పెద్ద హిట్ కాదు. తక్కువ బడ్జెట్ వల్ల ఫర్వాలేదనిపించింది. ఇక మెగా కాంపౌండ్ ఏరికోరి రామ్‌చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’, సాయిధరమ్‌తేజ్‌ని ‘నక్షత్రం’ వంటి చాన్స్‌లు వచ్చినా ఆయన వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. ఈయన బాలకృష్ణ కోసం ‘రైతు’ అనే స్టోరీనీ తయారు చేసినా కూడా అమితాబ్ నటించందే ఈ చిత్రం చేయనని బాలయ్య నో చెప్పాడు.
ఇక ఇటీవల చిరంజీవి కోసం ఆయన రాసుకున్న ‘వందేమాతరం’ చిత్రం మరలా లైన్‌లోకి వచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ అవి ఎంత వరకు నిజం? కృష్ణవంశీని చూసి చిరు చాన్స్ ఇస్తాడా? లేదా? అన్న చర్చసాగుతోంది. ఈయన తాజాగా ట్విట్టర్‌లో అభిమానులతో మాట్లాడాడు. ఓ అభిమాని ‘చక్రం’ వంటి చిత్రం ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించాడు. దానికి ఆయన సమాధానం ఇస్తూ, అలాంటి ఆలోచన నాకు లేదు. ‘చక్రం’ మంచి చిత్రమే కానీ అది ప్రజలకు కనెక్ట్ కాలేదు. డబ్బులు రాలేదు. అదే చిత్రం ఇప్పుడు బుల్లి తెరపై వస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తన బాధని వ్యక్తం చేశాడు.
మరో అభిమాని జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ రొమాన్స్ మూవీ తీయండి సార్.. అని అడిగితే కృష్ణవంశీ సమాధానం ఇస్తూ... మీరు కోరుకున్న విధంగా ఎన్టీఆర్‌తో రొమాంటిక్ మూవీ తీయడానికి యువ దర్శకులు ఎందరో ఉన్నారు. వారు అలాంటి చిత్రం తీస్తే బాగుంటుంది అని చెబుతూ, తన తదుపరి చిత్రం గురించి మాత్రం దాటవేశాడు. తర్వాత చిత్రం ఎలా ఉంటుంది? అనేది కూడా చెప్పలేదు. ఏ చిత్రం తీసినా పూర్తి అంకితభావంతో చేస్తానని చెప్పిన కృష్ణవంశీ గతంలో ఎన్టీఆర్‌తో ‘రాఖీ’ చిత్రం తీశాడు. ఇది బ్లాక్‌బస్టర్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు మాత్రం ఆయన సాధించారు.