800 సినిమాలకు పైగా పనిచేసిన హాస్యనటుడు రాళ్ళపల్లి తీవ్ర అనారోగ్యంతో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం మృతి చెందారు. చాలా రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాళ్ళపల్లి శుక్రవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
‘స్త్రీ’ నటుడిగా ఆయనకు తొలి చిత్రం. 1979లో ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్ 1 విడుదల, సూర్య, ఐపీఎస్, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరాకాండ, భలే భలే మగాడివోయ్ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు.
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు ఆయన సేవలందించారు. తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్ 10న జన్మించిన రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలక్షణ నటుడ్ని కోల్పోయినందుకు సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.