నిజానికి ఏదైనా చిత్రానికి ట్యూన్స్‌తో పాటు మంచి బీజీఎం కూడా చాలా ముఖ్యం. గతంలో ఇళయరాజా నుంచి రెహ్మాన్ వరకు ఈ రెండింటిలో తమదైన సత్తా చాటి మెప్పించారు. మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కలిసి పని చేసేవారు. ఉదాహరణకు రాజ్-కోటిలను తీసుకుంటే కోటికి ట్యూన్స్ మీద ఎంత పట్టుందో.. రాజ్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద అంత పట్టుండేది. ఇక రాజన్-నాగేంద్ర నుంచి శంకర్-ఎహసాన్-లాయ్ వరకు ఇలా జతకట్టిన వారే. ఇక టాలీవుడ్‌లో ఈ రెంటిని బ్యాలెన్స్ చేసిన సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి. నిజానికి కీరవాణి కూడా ఈ విషయంలో తన సోదరుడైన కళ్యాణి మాలిక్ సహాయం తీసుకునే వాడు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో మొదటి స్థానం కోసం పోటీలో దేవిశ్రీప్రసాద్, తమన్‌లు ముందంజలో ఉన్నారు. మొదట్లో వరుసగా మూస సంగీతం అందించిన తమన్ ఈమధ్య ‘భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత వీరరాఘవ’ వంటి చిత్రాలతో పాటు ‘మజిలీ’ వంటి చిత్రానికీ బీజీఎం అందిస్తూ, రాను రాను తనలోని వైవిధ్యాన్ని బయటకు తెస్తున్నాడు. కానీ దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇటు ట్యూన్స్, అటు బీజీఎం విషయంలో కూడా వరుసగా నిరాశపరుస్తున్నాడు. ఇటీవల ఆయన సంగీతం అందించిన ‘వినయ విధేయ రామ’తో పాటు తాజాగా వచ్చిన మహేష్ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’కి అందించిన ఆల్బమ్స్ కూడా మెప్పించలేకపోయాయి. ‘మహర్షి’లో ఓ రెండు పాటలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. అయినా మహేష్ త్వరలో చేయబోయే అనిల్‌రావిపూడి చిత్రానికి కూడా దేవిశ్రీనే ఫైనల్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో మహేష్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
ఆ అభిమాని ఈసారి చిత్రానికి దేవిశ్రీని కాకుండా తమన్‌ని తీసుకోండి..అంటూ సూచించిడంతో పాటు ‘దూకుడు’ తాలూకు ఇంట్రో క్లిప్‌ని కూడా దానిలో పొందుపరిచాడు. అంతేకాదు.. మహేష్ అభిమానులు ఈ విషయంలో దేవిశ్రీపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ట్వీట్‌కి తమన్ లైక్ కొట్టడం మరింత సంచలనానికి దారి తీస్తోంది. కాగా దేవిశ్రీ అభిమానులు సైతం తమన్ పూర్ మ్యూజిక్ ఇచ్చిన పలు సీన్లను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం కాస్తా తమన్, దేవిశ్రీల మద్య కోల్డ్‌వార్ జరుగుతుందనే సంకేతాలను అందించడం విచారించాల్సిన విషయం.