ఏ సందర్భంలో దర్శకుడు వంశీ పైడిపల్లి.. మహర్షి గురించి చెబుతూ ఘట్టమనేని అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని అన్నాడో.. అభిమానులు ఏమోగానీ.. చిత్ర హీరో మాత్రం ప్రతి ప్రెస్ మీట్లో కాలర్ ఎగరేస్తూ.. అభిమానులను, చిత్రయూనిట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. నిజంగా ఈ సినిమా మంచి మెసేజ్‌తో వచ్చిన మాట వాస్తవమే కానీ.. అభిమానులు కాలర్ ఎగరేసుకునేంత సినిమా అయితే ‘మహర్షి’ కాదు అనేది స్వయంగా మహేష్ అంటే పడి చచ్చిపోయే అభిమానులే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. సమయం దొరికితే చాలు కాలరేగరేస్తూ మహేష్ మాత్రం వారికి వింత అనుభూతిని ఇస్తున్నాడు.
తాజాగా మహేష్ బాబు హైదరాబాద్‌లో తనకు కంచుకోట వంటి థియేటర్‌ను సందర్శించాడు. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌ను చిత్రయూనిట్‌తో సందర్శించిన మహేష్.. తన ఎ.ఎం.బి.సినిమాస్ కంటే కూడా ఈ సుదర్శన్ థియేటరే నా సొంత థియేటర్‌గా భావిస్తాను అన్నారు. ఈ థియేటర్‌ను ఎప్పటికీ మరచిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే నాపై ఉండాలి. నా 25 సినిమాల కెరీర్‌లో ఈరోజు పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేను. మీ అందరి కోసం మరోసారి కాలర్ ఎగరేస్తున్నాను అంటూ మరోసారి తన కాలర్ ఎగరేసి.. మహర్షి విజయాన్ని తను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలిపే ప్రయత్నం చేశాడు.
మరి వాస్తవానికి ఈ సినిమాలో ఉన్న మెసేజ్ పక్కన పెడితే కలెక్షన్లపరంగా మాత్రం ఈ ‘మహర్షి’ సాధించాల్సి చాలా ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా ఇంకా రాని ఈ ‘మహర్షి’ లాభాల బాట పట్టాలంటే ఇంకా రెండు మూడు వీకెండ్‌లు కావాలి. మరి ‘మహర్షి’ పరిస్థితి ఇలా ఉంటే మహేష్ మాత్రం కాలర్ ఎగరేసి మరీ.. ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రచారం మొదలెట్టాడు.