అల్లుఅరవింద్ చిన్నతనయుడు అల్లుశిరీష్ ప్రస్తుతం విడుదల కానున్న ‘ఎబిసిడి’పై బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఇప్పటివరకు ఆయనకు ‘శ్రీరస్తు..శుభమస్తు’ తప్ప ఓ మోస్తరు హిట్ కూడా లేదు. అందుకే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిన్నచిత్రంతో నిఖిల్ వంటి హీరోకి తిరుగేలేని హిట్‌ని ఇచ్చిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఆయన ఎన్నో ఆశలతో ‘ఒక్కక్షణం’ చిత్రం చేశాడు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. అలాంటి సమయంలో రామ్‌చరణ్, అల్లుశిరీష్‌ని పిలిచి మలయాళ ‘ఎబిసిడి’ ఒరిజినల్ వెర్షన్ చూపించి చేయమని చెప్పాడట. సో.. ఇంతకాలం స్ట్రెయిట్ కథలతో హిట్ కొట్టలేకపోయిన శిరీష్ ఈసారి ఆల్‌రెడీ ప్రూవ్ చేసుకున్న చిత్రం రీమేక్‌గా ‘ఎబిసిడి’ చేస్తున్నాడు.
అమెరికా నుంచి వచ్చి సాధారణ జీవితం గడిపే హీరో పాయింట్‌తో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ సబ్జెక్ట్ మలయాళీలకు కొత్తేమోగానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం సుపరిచితమే. ప్రభుదేవా దర్శకత్వంలో యం.యస్.రాజు నిర్మించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో విదేశాల నుంచి ఇండియాకి వచ్చిన హీరో పల్లెటూరికి చెందిన త్రిషని ప్రేమించి, ఆమె సోదరుడు శ్రీహరి కోరిక మేరకు కష్టపడి కారం అన్నం తింటూ, వ్యవసాయం చేసి అనుకున్నది సాధిస్తాడు. ఇక ఈ చిత్రం వేడుకలో నేచురల్ స్టార్ నాని చెప్పినట్లు ఆయన అశోక్ దర్శకత్వంలో నటించిన ‘పిల్లజమీందార్’ చిత్రం కూడా అంతే. డబ్బున్న ఫ్యామిలీకి చెందిన నాని ఓ సాధారణ కాలేజీలో చదువుతూ పడేకష్టం ఏమిటి? అనేదే ఆ పాయింట్. ఇంతకంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా విక్రమార్క’ కూడా అదే కోవకి చెందిన చిత్రం. ఇది తమిళ నాటి స్టార్ ప్రభు నటించిన ఓ తమిళ చిత్రానికి రీమేక్. ఇందులో యువరాజు అయిన చిరంజీవి సాధారణ జీవితం గడుపుతూ తాననుకున్నది సాధించే పాయింట్‌తో రూపొందింది.
ఇంకా ఈ పాయింట్‌తో పాత చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ కొత్తది కాకపోయినా నేటి తరం యూత్‌ని ఆకర్షించేలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఆసక్తికర కథనం ఉంటే మాత్రం అల్లుశిరీష్‌కి మంచి చిత్రం అవుతుంది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే మ్యాన్షన్ హౌస్ డైలాగ్ విపరీతంగా పేలింది. యూత్‌ని ఈ డైలాగ్ ఇట్టే ఆకట్టుకుంది. మరి చిత్రం విడుదలైన తర్వాత ఈ చిత్రం అల్లుశిరీష్‌కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి...! మొత్తానికి చాలా కాలానికి తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కథను శిరీష్ ఎంచుకున్నాడనే చెప్పాలి.