సినిమా అనేది శక్తివంతమైన మీడియా. దీని ద్వారా ప్రజలకు, ప్రేక్షకులకు, అభిమానులకు, మొత్తం సమాజానికి ఎంతో మంచి సందేశం ఇవ్వవచ్చు. కానీ చాలామంది మెసేజ్‌లు ఇవ్వడానికి కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయాల్సిన పనిలేదని, ఓ మెసేజ్‌ని ఫోన్ నుంచి పంపితే చాలంటారు. తాజాగా దర్శకుడు తేజ కూడా నిజం చిత్రం ద్వారా సందేశం ఇవ్వడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నానని, ఇకపై అలాంటి సందేశాత్మక చిత్రాలు చేయనని చెప్పాడు. కానీ తేజ ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి చిత్రీకరణే ముఖ్యమని అర్ధం చేసుకోకుండా మెసేజ్‌లు చూడరని చెప్పడం విడ్డూరం. అయితే చెడు వెళ్లినంత త్వరగా మంచి వెళ్లలేదనేది వాస్తవం. ఇక మన స్టార్స్ సందేశం ఇస్తూ రైతుల కష్టాలు, కడగండ్లు చూబుతూ తమిళ కత్తి రీమేక్ ‘ఖైదీనెంబర్ 150’ని తీశాడు. ఇక తాజాగా మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ కోసం కూడా రైతుల బాధలు ఇతివృత్తానే తీసుకున్నాడు. దీనిని మనం మెచ్చుకుని సినిమాని ఆదరించాల్సిందే. ఇక రైతులను జాలిగా చూడటం తప్పు.. వారికి సరైన గౌరవం ఇవ్వడం ముఖ్యం అనేది తెలిసిందే.
ఇక మహేష్ విషయానికి వస్తే ఆయన సొంత ఊరి దత్తత బ్యాక్‌డ్రాప్‌లో నాటి చంద్రబాబు ‘జన్మభూమి’ తరహాలో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే పాయింట్‌ని పవర్‌ఫుల్‌గా చెప్పాడు. మహష్ వంటి స్టార్ పిలుపు విని ఎందరో తమ గ్రామాలను, తమకిష్టమైన వాటిని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. స్వయంగా మహేష్ తన సొంత ఊరు బుర్రిపాలెంతోపాటు తెలంగాణలోని గ్రామాన్నిదత్తత తీసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఓ ఊరిని దత్తత తీసుకున్నాడు. ఇలా సమాజాన్ని మార్చే శక్తి స్టార్ హీరోలపై చాలా ఉందని అర్ధమవుతోంది. ఇక ‘మహర్షి’లో రైతుల బాధలను చూపడమే కాదు.. అందరు వీకెండ్స్‌లో వ్యవసాయం చేయాలనే సందేశాన్ని మహేష్ అందించాడు.
దాంతో మధుర శ్రీధర్‌రెడ్డి నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు కూడా వీకెండ్స్‌లో తమ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేస్తున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేస్తున్నారు. ఇక శ్రీమంతుడులో చూపిన సందేశాన్ని మహేష్ స్వంత జీవితంలో కూడా అనుసరించినట్లు ఆయన కూడా పవన్‌లా వీకెండ్స్‌లో వ్యవసాయం చేస్తాడా? లేక వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి రిలాక్స్ అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీమంతుడు గ్రామంలోని జలాలను మల్టీ నేషనల్ కంపెనీని తమ బ్రాండ్ల తయారీకి వాడుకుని ఎంతగా గ్రామాలను దోచుకుంటున్నారో చూపారు.
ఇక ‘మహర్షి’ విషయానికి వస్తే రైతుల సమస్యలు చూపించాడు. ఇలా నీతులు చెప్పే మహేష్ శ్రీమంతుడులో చూపిన కార్పొరేట్ కంపెనీల అరాచకాలను చూస్తూ ఉండటమే కాదు.. అలాంటి కంపెనీ బ్రాండ్ అయిన ‘థమ్సప్’కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఎండాకాలం రైతులను ప్రోత్సహించేలా దేశీయపానీయాలైన చెరకురసం, పండ్ల జ్యూస్‌లు, లస్సీ, మజ్జిగ, కొబ్బరి బోండాం వంటి వాటిని ప్రాచుర్యం కలిగించకుండా రైతులను పీల్చి పిప్పి చేస్తోన్న‘థమ్సప్’ వంటి వాటికి మహేష్ దూరంగా ఉండాలి.