ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి నుంచి అమితాబ్‌బచ్చన్, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ వరకు ఎందరో అటు రాజకీయాలను చేస్తూనే సినిమాలను కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పలువురు అంటే మెగాస్టార్ చిరంజీవి వరకు మరలా సినిమాలు చేస్తూనే వచ్చారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాలలో ఉంటూనే ‘మేజర్‌చంద్రకాంత్, సమ్రాట్’ వంటి పలు చిత్రాలలో నటించాడు. విషయానికి వస్తే ఇండియన్ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ ఎంతో కాలం ఇదిగో అదిగో అని ఊరిస్తూ చివరకు రాజకీయాలలోకి వస్తానని చెప్పాడు. వెంటనే మాట మార్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎవ్వరికీ మద్దతు ఇవ్వనని చెప్పిన ఆయన తమిళనాడుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడమే కాదు... అభ్యర్దులను కూడా నిలబెడతానని చెప్పాడు. అయితే ఒకవైపు రాజకీయాలలోకి దిగిన కమల్‌హాసన్ సొంత పార్టీపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు.
కానీ రజనీ మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే తమిళనాడు అసెంబ్లీ నాటికి చెడ్డపేరు వస్తుందని, అంతేగాక లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచిచూడటమే మంచిదని ఆయన సార్వత్రిక ఎన్నికల్లో మౌనంగా ఉన్నాడు. ఇక రజనీ రాజకీయాలలోకి వచ్చినా ఆయన నటించాల్సిందేనని ఆయన వీరాభిమానులు పట్టుబడుతున్నారు. చివరకు రజనీ నుంచి వారికి తీపికబురు అందింది. రాజకీయాలలోకి వచ్చినా తాను సినిమాలు చేస్తూనే ఉంటానని రజనీ తెలిపాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ చిత్రం చేస్తున్న తాను తదుపరి చిత్రం కోసం కథలు కూడా వింటున్నానని తెలిపాడు. పార్టీ పెట్టినా సినిమాలలో కొనసాగుతాను. 2021లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా సినిమా కెరీర్‌ని వదలనని చెప్పుకొచ్చాడు. మరి కేవలం ఆయన ఎమ్మెల్యే మాత్రమే అయితే సినిమాలలో నటించడానికి వీలుంటుంది.
కానీ ఆయన రాజకీయాలలో అనూహ్య విజయం సాధించి, సీఎం పీఠాలు అధిష్టించే పరిస్థితి ఉంటే ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించవచ్చనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి రజనీ ఎన్టీఆర్ బాటలోనే సేఫ్‌గేమ్ ఆడుతూ, అటు సినిమాలు, ఇటు రాజకీయాలను రెండింటిపై దృష్టి పెట్టడం అనేది జరిగితే రజనీకి ఎన్నికల్లో గెలిచే సత్తాలేదని, కాబట్టే ఆయన సినీ రంగాన్ని వదలడం లేదనే చెడ్డపేరు వచ్చినా వస్తుంది. కానీ రజనీకి మాత్రం ఇది మంచి స్ట్రాటర్జీగానే కనిపిస్తోంది.