త్వరలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. 23వ తేదీన అధికారం ఎవరిది? ప్రతిపక్షం ఎవరిది? అనేది తేలనుంది. అయితే టిడిపి, వైసీపీలలో ఒకటి అధికార పక్షంగా, మరోటి ప్రతిపక్షంగా ఉండనుందని సర్వేలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. ఈ రెండింటికి దూరంగా జనసేన ఉండనుంది. ఒకవేళ టిడిపి, వైసీపీ రెంటికి పూర్తి మెజార్టీ రాకపోతే పవన్ జనసేన కింగ్ మేకర్ అవుతుంది. ఇక ఎన్నికల తర్వాత పెద్దగా సీట్లు గెలవలేని పక్షంలో పవన్ మరలా సినిమాలలోకి వస్తాడా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. తనకు ఏ వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలు లేవని, సినిమాలే తన ఆదాయమని పలుమార్లు పవన్ చెప్పాడు. కాబట్టి పవన్ మైత్రి మూవీస్, ఎ.యం.రత్నం వంటి వారి వద్ద అడ్వాన్స్‌లు తీసుకున్నాడు కాబట్టి వారికి సినిమాలు చేస్తాడని అందరు భావించారు. పవన్ తన అఫిడవిట్‌లో మైత్రి సంస్థ ఇచ్చిన అడ్వాన్స్‌ని అప్పుగా చూపించాడు. అయినా పవన్ మరలా నటిస్తాడనే అందరు భావిస్తూ వచ్చారు.
కానీ పవన్ మాత్రం వాటికి తాజాగా చెక్ పెట్టాడు. జనసేన కేవలం ఈ రోజు కోసం పుట్టింది కాదు.. మన టార్గెట్ 25ఏళ్లు, వచ్చే ఎన్నికల ఫలితాలలో అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ ఉంటే మనం మాత్రం ప్రజాసమస్యలపై పోరాడాలని కార్యకర్తలను, కిందటి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశాడు. అంటే పవన్ మరలా సినిమాలలోకి రాకపోవచ్చని స్పష్టమవుతోంది. కొంత కాలం కిందట నాగబాబు కూడా ఇక పవన్ సినిమాలలో నటించకపోవచ్చని చూచాయగా తెలిపాడు.
మొత్తానికి పవన్ జనసేన విషయంలో తన మాట మీద నిలబడుతున్నాడనే చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి కోసం రాలేదు... ప్రజాసమస్యల గురించి ప్రశ్నించడానికి వచ్చాను. 25ఏళ్లు టార్గెట్‌గా అధికారంలోకి వచ్చేందుకు పోరాడుదామని ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాడనే చెప్పాలి. దీంతో పవన్ సినీ అభిమానులు బాగా నిరుత్సాహపడినా పవన్ మాట మాత్రం నిలకడగానే ఉంది. ఇక సరికొత్త రాజకీయాలకు అద్దం పట్టేలా ఏపీ ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసి ప్రజలకు కొన్ని వాగ్థానాలు చేసిన అభ్యర్దులలో కొందరు ఎన్నికల అనంతరం ఫలితాలు రాకుండానే తమ సొంత డబ్బుతో హామీలను నెరవేరుస్తూ ఉండటం అనేది నిజంగా పెద్ద మార్పుకిందనే భావించాలి.