సినిమా కథలు అంటే జుట్టుపీక్కుని ఏదో కొత్త పాయింట్‌ని వెతకడం అనేది బాగానే ఉంటుంది గానీ మన చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలలోని ప్రతి క్యారెక్టర్‌తో ఒక్కో చిత్రం కథ రెడీ చేయవచ్చు. ఉదాహరణకు ‘భారతం’లోని కర్ణుడు, ధుర్యోధనుడు, కుంతి, అర్జునుడు తరహా పాత్రలతో మణిరత్నం రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్‌స్వామిలతో ‘దళపతి’ తీశాడు. ఇక ‘కుంతి’ కథ ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి. మణిరత్నం తీసిన ‘రావణ’ కూడా అంతే. ఇలా ప్రతి చిత్రానికి ఏదో ఒక పురాణం, ఇతిహాసం నుంచి మూలం కనిపిస్తుంది. ఇక ‘రామాయణం’ అంటే ఎవర్‌గ్రీన్‌సబ్జెక్ట్. అది నిజంగా జరిగి ఉంటే అద్భుతం. అదే ఊహాజనికమైనది అయితే ఆ కల్పన మహాద్భుతం అని ఓ ప్రముఖ పండితులు అంటారు. అలాంటి రామాయణం అనేది హక్కుల కన్నా బాధ్యత గొప్పదని చెప్పిన కావ్యం. నిజానికి మనం ప్రాధమిక హక్కుల కోసం పోరాడతామే గానీ మనకున్న ప్రాధమిక విధులను మరిచిపోతున్నాం. దానిని గుర్తు చేసేది రామాయణం.
హక్కుల కన్నా బాధ్యత గొప్పదన్నశ్రీరామతత్వం.. కష్టంలో ఆత్మవిశ్వాసం నిలుపుకున్న సీత తత్వం... అవసరంలో కుటుంబ బాధ్యత పంచుకున్న లక్ష్మణుడి తత్వం... నమ్మినవారి కోసం ఏమైనా చేయగల హనుమంతుని తత్వం.. వెరసి ఇది అద్భుత జీవన తత్వమనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే ఎప్పుడు టీనేజ్ ప్రేమకథలు అంటూ హంగామా చేసే దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’తో తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన మోడ్రన్ రామాయణంగా అందులోని పాత్రల తత్వాలను తనదైన శైలిలో మార్చి ‘సీత’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోస్ బాగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీత పేరుతో ఉండే అమ్మాయి కాజల్ అగర్వాల్‌ని స్వార్ధపరురాలు.. దుర్మార్గురాలిగా, రాముడు పాత్రని తెలివి, ధైర్యం కలిగిన లక్షణాల నుంచి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని బహు అమాయకుడిగా, సీతని దక్కించుకోవాలనే రావణాసురుడుగా సోనూసూద్‌ని చూపిస్తూ ఉన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులు, నెటిజన్లు బాగా ఆసక్తి చూపుతున్నారనే దానికి ఈ చిత్రం ప్రోమోలు, అంతకు మించి ట్రైలర్‌కి లభిస్తున్న ఆదరణే ఉదాహరణ.
ఇప్పటివరకు ఈ ట్రైలర్‌ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ వారి అధికారిక చానెల్‌లోనే 2.5 మిలియయన్ వ్యూస్ వచ్చాయి.. ఈ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ‘బుల్‌రెడ్డి’ పాటకు కూడా అద్భుతమైన రెస్సాన్స్ వస్తోంది. ఈ అంకెల స్టార్ హీరోలకు తక్కువే కావచ్చు గానీ తేజ, బెల్లకొండ సాయిశ్రీనివాస్, కాజల్ వంటి వారికి మాత్రం ఎక్కువే అని చెప్పాలి. మొత్తానికీ ‘సీత’ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో తేజ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.