టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ‘బాహుబలి’ తర్వాత ఎంతో ఎత్తుకి ఎదిగింది. నిజమే.. కానీ మన దర్శకులు, హీరోల ధోరణిలో ఇంకా మార్పురావాల్సిన అవసరం ఉంది. హీరోలు తమ ఇమేజ్‌లను, ఇగోలను పక్కనపెట్టి ‘వినయ విధేయ రామ, అజ్ఞాతవాసి’ వంటి చిత్రాల జోలికి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఇంకా అర్దం చేసుకోవడం లేదు. మంచి ప్రయోగం తీసి సినిమా పెద్దగా ఆడకపోయినా ఓ మంచి సినిమా చేశామన్న ఫీలింగ్, ప్రశంసలైనా వస్తాయి. అలాగని కోట్లాది రూపాయల డబ్బుతో జూదం ఆడమని ఎవ్వరు చెప్పరు. చిరంజీవికి ‘ఆరాధన, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు’ వంటి చిత్రాలు పెద్దగా ఆడకుండా ఆయన ‘అమ్మడు లెట్స్ కుమ్ముడు’ అంటేనే జనం చూస్తున్నారు.
అభిమానులకు అవే కావాలి కాబట్టి అభిమానుల కోసం సినిమాలు తీస్తున్నారే గానీ సాధారణ ప్రేక్షకులని మెప్పించే చిత్రాలను తీయలేకపోతున్నారు. అలాగని మనవద్ద టాలెంట్ లేదా? అంటే అద్భుతం అనే చెప్పాలి. ‘రంగస్థలం’ చిత్రంతో ఈ విషయాన్ని రామ్‌చరణ్ ప్రూవ్ చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’తో ఎన్టీఆర్ సత్తా చాటాడు. ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్ హీరోయిజం మీద ఆధారపడకుండా ఆయనను పోలీస్ పాత్రలో నెగటివ్‌గా చూపిస్తూనే ఎంతో అగ్రెసివ్‌గా తీసిన చిత్రం ‘టెంపర్’. కానీ ఈ చిత్రం క్లైమాక్స్ సుఖాంతం కాకుండా ఉంటే మరో లెవల్‌కి వెళ్లేది. కానీ మనవారు అది చేయలేకపోయారు. ‘ఠాగూర్’ ఒరిజినల్ ‘రమణ’ క్లైమాక్స్‌లో కూడా చిరు కోసం క్లైమాక్స్‌ని మార్చారు. కానీ అసలు సినిమాలో చెప్పాలనుకున్న ఆత్మని మన వారు మిస్ చేశారు.
కానీ ఈ విషయంలో కోలీవుడ్ మరోసారి సత్తా చాటింది. ‘టెంపర్’కి రీమేక్‌గా విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ చిత్రం తాజాగా విడుదలైంది. ఇది ‘టెంపర్’కి రీమేక్ కాబట్టి తెలుగులో డబ్ చేసే పరిస్థితి లేదని విశాల్ గట్టిగానే చెప్పాడు. ఈ చిత్రం క్లైమాక్స్‌కి తమిళతంబీలు నీరాజనాలు పలుకుతున్నారు. చిత్రం క్లైమాక్స్‌లో హీరోని కూడా చంపి విషాదాంతం చేయడంతో కథకి నిండుతనం, ఒరిజినల్ ఫీల్ వచ్చాయనే చెప్పాలి. మరి ఈ విషయంలో మన స్టార్స్ ఎప్పుడు మారుతారో చూడాలి...!