సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలలో వారే డబుల్ రోల్స్, రెండు మూడు వేరియేషన్స్ ఉండేలా గెటప్‌లు వేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా కొన్ని చిత్రాలలో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, విలన్లు కూడా డబుల్ రోల్ వేసినవి ఉన్నాయి. కానీ వాటి శాతం చాలా అరుదు అనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, అల్లుఅరవింద్ డబ్ చేసిన చిత్రం ‘గజిని’. ఈ చిత్రం సూర్యని టాలీవుడ్ స్టార్‌ని చేసింది. ఇందులో విలన్‌గా నటించిన ప్రదీప్‌రావత్‌ది అందులో డ్యూయల్ రోల్. కాకపోతే ఇది క్లైమాక్స్ ముందు రివీల్ అవుతుంది. ఇక బాలయ్యతో పాటు శోభన్‌బాబు, నగ్మా వంటి భారీ కాస్టింగ్‌తో వైజయంతీ మూవీస్ బేనర్‌లో రూపొందిన డిజాస్టర్ మూవీ ‘అశ్వమేథం’లో కూడా అమ్రిష్‌పూరి డబుల్ యాక్షన్ చేస్తాడు. ఒక పాత్ర చనిపోయిన తర్వాత మరో పాత్ర ఎంటర్ అవుతుంది. ఈ చిత్రాన్ని నాడు చూసిన ప్రేక్షకులు ఇది ‘అశ్వమేథం’ కాదు ‘నరమేథం’అని వాపోయారు.
ఇక విక్టరీ వెంకటేష్ నటించిన ‘పోకిరిరాజా’లో శరత్‌బాబుది డ్యూయల్‌రోల్. ఇలా చూసుకుంటే తెలుగులో ఈ ఫార్ములా ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. కానీ కోలీవుడ్‌లో మాత్రం మురుగదాస్-సూర్యలు దాన్ని సాధ్యం చేశారు. తాజాగా ఇదే ఫార్ములాని బాలయ్యతో ‘జైసింహా’ చిత్రం తీసి, ప్రస్తుతం వెంటనే రెండో చాన్స్ అందుకున్న తమిళ సీనియర్ దర్శకుడు కె.యస్.రవికుమార్ ఫాలో అవుతున్నాడట. ‘జైసింహా’ గొప్ప చిత్రం కాకపోయినా పూర్తిగా బాలయ్య చిత్రాల తరహాలో పక్కా ఊరమాస్ చిత్రంగా ఫర్వాలేదనిపించింది. కాగా బాలయ్యతో కె.యస్ చేస్తోన్న రెండో చిత్రానికి కూడా సి.కళ్యాణే నిర్మాత. దీనికి ‘రూలర్’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నారని ప్రచారం సాగుతోంది. బాలయ్య ‘లెజెండ్’తో విలన్‌గా మారి బిజీ అయిన జగపతిబాబు ఇందులో మరోసారి ప్రతినాయకునిగా బాలయ్యతో పోటీపడుతున్నాడు.
కాగా కథానుసారం ఇందులో జగపతిబాబు డ్యూయల్‌రోల్ చేస్తున్నాడని సమాచారం. మరి అది తండ్రికొడుకులా, లేక అన్నదమ్ములా? ఒక పాత్ర చనిపోయిన తర్వాత రెండో పాత్ర వస్తుందా? వంటివన్నీ సస్పెన్స్‌గానే ఉన్నాయి. ఇక ఇందులో లేడీ విలన్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తోంది. ఇలా హీరో పాత్ర కాకుండా విలన్ పాత్ర డ్యూయల్‌రోల్ చేయడం, మరోవైపు ‘పలనాటిబ్రహ్మనాయుడు, సీమసింహం’ వంటి చిత్రాలలో లేడీ నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్న చిత్రాలు భారీ పరాజయం పొందడం వంటి బ్యాడ్ సెంటిమెంట్స్‌లన్నింటిని కె.యస్ బయటకు తీస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచిచూడాల్సివుంది..!