సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా మహర్షి చిత్రం చేశాడు. వీకెండ్‌లో కలెక్షన్లు బాగా ఉన్నాయి. ఇక అసలు విషయం సోమవారం నుంచి మొదలు కానుంది. బుధవారానికి ఈ చిత్రంపై ఓ క్లారిటీ వస్తుంది. ఇదే సమయంలో మహేష్ నటునిగా 20వ వసంతాన్ని జరుపుకుంటున్నాడు. ఈ రెండు విశేషాలను పురస్కరించుకుని విజయవాడలో భారీ వేడుక జరపాలని భావిస్తున్నారు. విజయవాడ వేదికగా నిలవడానికి కారణం నిర్మాతల్లో ఒకరైన పివిపితో పాటు మహేష్‌కి కూడా ఈ నగరం అంటే బాగా ఇష్టం. ఈ వేడుకను నెవర్ బిఫోర్ అనే స్థాయిలో జరపాలని భావిస్తున్నారు. ఇందుకోసం విజయవాడలోని కృష్ణానది తీరంతో పాటు లయోలా గ్రౌండ్స్‌ని కూడా పరిశీలిస్తున్నారు.
అయితే ఈ వేడుక ఎప్పుడు అనేది మాత్రం తెలియరావడం లేదు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం పోలీసులు అధికారులు బిజీబిజీగా ఉండనున్నారు. దాంతో 23 కంటే ముందే ఈ వేడుకను జరపాలంటే అది పోలీసులకు వీలు కాకపోవచ్చు. ఈవీఎంల వద్ద వారు పహారా కాస్తూ ఉన్నారు. మరి 23 తర్వాత ఈ వేడుకను జరపాలంటే అప్పటికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ‘మహర్షి’ లాంగ్ రన్ 23తో ముగిసినా ఆశ్చర్యం లేదు. కాబట్టి 23 తర్వాత జరిపితే అది ‘మహర్షి’ ప్రమోషన్స్‌కి, ప్రేక్షకులను థియేటర్లవైపు రప్పించేందుకు ఉపయోగపడదు. అంతకు లోపలే ఈ వేడుక జరిగితేనే ఫలితం ఉంటుంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘మహర్షి’టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజానికి ‘మహర్షి’ ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరపాలని భావించిన ఈవీఎంలు ఆ స్టేడియంలోనే ఉండటంతో పాటు పలు ఎన్నికల కారణాల వల్ల అది వీలు కాలేదు. ఇలా ఎన్నికల సెగ ‘మహర్షి’ని కూడా బాగా ఇబ్బంది పెడుతోంది. పైకి కనిపించని ప్రభావం ఈ చిత్రంపై పడుతోందనేది మాత్రం వాస్తవం.