మహేష్‌బాబు నటించిన మహర్షి చిత్రంలో వేరే కంపెనీ సీఈఓగా చేసే మహేష్‌బాబు జీతం ఏడాదికి 900కోట్లు అని ఓ ఇంటర్వ్యూ ఎపిసోడ్‌లో చూపించారు. మహేష్ బాగా డబ్బున్న సంపన్నుడు అయినా కూడా ఆయన బయటి కంపెనీలలో సీఈవోగా పనిచేస్తూ ఏడాదికి భారీ ఆర్జన చేస్తున్నట్లు చూపించారే గానీ మహేష్‌కే సొంత కంపెనీ ఉన్నట్లు చూపించలేదు. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఎందుకంటే శ్రీమంతుడు, అత్తారింటికి దారేది వంటి పలు చిత్రాలలో అలాంటి క్యారెక్టర్లు చూసి ఉన్నాం. ఇక వేరే కంపెనీలో సీఈవోగా పనిచేస్తూ అంత పెద్ద మొత్తం జీతం తీసుకునే భారతీయుడు ఉన్నాడా? అనే అనుమానం రావచ్చు.
కానీ గూగుల్ సీఈవో సుందర్ పిచ్చయ్ దీనికి స్ఫూర్తి అని అర్ధమవుతోంది. భారతీయునిగా ఆయన ఏడాదికి 1200కోట్లకు పైగా జీతభత్యాలు అందుకునే వాడు. ఇక మరీ మక్కీకి మక్కీగా ఉంటుందని మహేష్ వార్షిక ఆదాయాన్ని ఫిగర్ మార్చి 900కోట్లుగా చూపించారు. ఇక మహేష్ కంపెనీలకే ఏకంగా రివర్స్ ఆఫర్ ఇవ్వడం కాస్త అతిశయోక్తిగా ఉన్నా కూడా హీరోయిజంని ఎలివేట్ చేయడంలో దానిని ఓ భాగంగా తీసుకుని సర్దుకుపోవాలి. ఇలాంటి అతిశయోక్తులు, లాజిక్కులు మిస్ కావడం ‘ఎ’ సెంటర్ ఆడియన్స్ మీద తీవ్రప్రభావాన్నే చూపుతోంది.
సినిమా చూసిన వారు అందరు భలే ఉంది అనడం కంటే ఫర్వాలేదు.. ఒకసారి చూడవచ్చు అంటూ ఉండటంతో రిపీట్ ఆడియన్స్‌కి మద్దతు మహర్షికి లేదని స్పష్టమవుతోంది. కలెక్షన్ల విషయంలో ఇదే పాయింట్ మహర్షికి, రంగస్థలంకి మధ్య అసలైన తేడాను చూపుతోంది. రంగస్థలం చూసిన అందరు అద్భుతం అనడంతో పాటు ఒకటికి రెండు మూడు సార్లు చూశారు. కానీ ఆ స్థాయిలో మహర్షి లేకపోవడం మాత్రం మహేష్‌కి ఇబ్బంది కలిగించనుందనేది వాస్తవం.