గత రెండు మూడేళ్లుగా అల్లరినరేష్ కెరీర్ చాలా ఇబ్బందుల్లో కొనసాగుతోంది. 40కి పైగా చిత్రాల వరకు ఆయన మినిమం గ్యారంటీ హీరోగా మంచి హిట్స్ ఇచ్చినా చివరి పది పదిహేను చిత్రాలు ఆయనను స్థిమితం లేకుండా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వంశీపైడిపల్లితో పాటు తన క్యారెక్టర్ మీద నమ్మకంతో మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్ నటించిన 25వ ప్రతిష్టాత్మక చిత్రం ‘మహర్షి’లో కీలకపాత్రను చేశాడు. ఈ చిత్రం ద్వారా బాగా లాభపడింది ఎవరు అంటే ఎవరైనా ఇట్టే రవి పాత్రలో నటించిన అల్లరినరేష్ అనే అంటున్నారు. నిజానికి ఈ చిత్రంలో కీలకమైన మలుపుకి కారణం అయి, సినిమాని మలుపు తిప్పే పాత్రలో రవిగా అల్లరినరేష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాలోని కొన్ని సీన్లు చూస్తే రిషి పాత్ర కంటే రవి పాత్రలోనే ఔన్నత్యం, ఉదాత్తత కనిపిస్తాయి. ఆయన పాత్ర ప్రేక్షకులను హృదయాలను తాకుతోంది. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో టాక్ రాకపోయినా, డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా రైతుల సమస్యలను భుజాన వేసుకుని మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం వరకు మెచ్చుకోదగిన విషయమే.
అయితే ఇది కొన్ని ఆల్‌రెడీ వచ్చిన చిత్రాల కిచిడీగా మారి, వాటి పోలికల్లో ఉండటం నిరాశ కలిగించే విషయం. మొత్తం మీద ఈ చిత్రం వల్ల మహేష్‌కి ఇదేమీ మాస్టర్ పీస్‌గా కెరీర్‌లో నిలిచిపోయే ఎపిక్ చిత్రం ఏమీ కాదనే చెప్పాలి. ఇక దిల్‌రాజు మాటల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం సినిమా చూసిన తర్వాత సడలిందనే చెప్పాలి. మహేష్ చిత్రం కాబట్టి ఎంత ఊహించుకుని వచ్చినా ‘మహర్షి’ మెప్పిస్తుందనే ఆయన మాటలు అతిశయోక్తులుగానే మిగిలుతాయనేది ఖాయం. ఇక అల్లరినరేష్ మాత్రం ఈ విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నాడు. విచిత్రంగా ఆయన మొదటి చిత్రం ‘అల్లరి’లో ఆయన పాత్ర పేరు రవి. మరలా 55వ చిత్రంగా చేసిన ‘మహర్షి’లో కూడా ఆయన పేరు రవినే కావడం కాకతాళీయమే కావచ్చు.
అదే సందర్భంలో ‘అల్లరి’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు అల్లరినరేష్ పరిచయమై 17ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా అల్లరినరేష్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘మహర్షి’ చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్, నాపాత్రకు లభిస్తున్న ఆదరణ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 17ఏళ్ల కిందట మే 10న నేను నటించిన మొదటి చిత్రం ‘అల్లరి’ విడుదలైంది. అందులోనూ రవిగా, ‘మహర్షి’లోనూ రవిగా నటించడంతో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయినట్లుగా భావిస్తున్నాను. 17ఏళ్ల కిందట ఓ కొత్తకుర్రాడు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడా? లేదా? అనే సంశయాల మధ్య 55 సినిమాలు పూర్తి చేసుకోవడం ఆ ప్రేక్షకుల ఘనతే. అందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపై అందరికీ నచ్చే చిత్రాలనే ఎంచుకుంటానని తెలిపాడు.