మహేష్ బాబు, కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడే.... వంశి పైడిపల్లి ఒక స్టోరీ లైన్ వినిపించి మహేష్ బాబుతో సినిమా కమిట్ చేయించాడు. వంశి పైడిపల్లికి, దిల్ రాజు అండదండలు ఉండడంతో... నమ్రతతో ఈ సినిమాని డీల్ చేసిన దిల్ రాజు బ్యాచ్ ఈ సినిమాని పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టేసింది. ఇక వంశి పైడిపల్లి పూర్తి స్క్రిప్ట్ పట్టుకుని... దేవిశ్రీతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసి మహేష్ కోసం దాదాపుగా చాలా నెలలపాటు వెయిట్ చేసాడు. మహేష్ కూడా వంశి పైడిపల్లి కథకు బాగా కనెక్ట్ అవడంతో.. తన కెరీర్ లో ఈ 25 వ సినిమా ఎప్పటికి మరిచిపోలేనిదిగా ఉంటుందని నమ్మాడు. ఇక దిల్ రాజుతో అశ్వినీదత్ మరో నిర్మాత పీవీపీలు కలవడంతో.. ఈ సినిమాకి వంశి పైడిపల్లి ఎడా పెడా ఖర్చు పెట్టించాడు.
మామూలుగానే వంశి పైడిపల్లి రిచ్ గా సినిమాలు చేస్తాడనే టాక్ ఉంది. ఇక మహర్షికి కూడా వంశీ నిర్మాతలు ముగ్గురి చేత బాగానే ఖర్చు పెట్టించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా సుదీర్ఘంగా అంటే దాదాపుగా పది నెలలపాటు చిత్రీకరిస్తూనే ఉన్నాడు వంశి. మధ్యమధ్యలో రీ షూట్స్ గట్రా ఇలా ఈ సినిమాకి తడిసి మోపెడు బడ్జెట్ అయ్యింది. మహర్షి సినిమాలో స్టూడెంట్ పాత్ర, ఒక బడా కంపెనీ సీఈవో పాత్ర, అలాగే రైతుల కోసం పోరాడే వ్యక్తి పాత్రకి మహేష్ బాగా కనెక్ట్ అయినట్లుగా మహర్షి సినిమా చూసాక కానీ అర్ధం కాదు. అయితే ఈ స్టూడెంట్, సీఈవో, రైతు పాత్రలను కనెక్ట్ చెయ్యడానికి వంశి పైడిపల్లి చాలానే కష్టపడ్డాడు. రైతు ఎపిసోడ్ కి మంచి పేరొచ్చినా.. సినిమాలో లెక్కకు మించి సోషల్ మెస్సేజ్ లు ఉన్నాయి. ఇక ఇలాంటి సినిమాలలో స్క్రీన్ ప్లే క్రిస్పీ గా ఉండాలి. కానీ వంశి మాత్రం స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు.
ఇక కథ మొత్తం మహర్షి మహేష్ చుట్టూనే తిప్పే క్రమంలో మిగతా పాత్రలను పూర్తిగా వాడుకోలేకపోయాడు. అందులో ప్రకాష్ రాజ్, పూజా హెగ్డే, జయసుధలాంటి కేరెక్టర్స్ అలా ఉండిపోవాల్సిన పరిస్థితి. మరి మహేష్ కథలో హీరో పాత్రకే ఎక్కువ వ్యాల్యూ ఇచ్చి మిగతా వారిని విస్మరించాడా అనిపిస్తుంది. అసలు మహేష్ 25 వ సినిమా ఇలానే ఉండాలని కోరుకున్నాడా? లేదంటే మరేదన్నానా అంటే మహేష్ అనుకున్నంతగా మహర్షి సినిమాని ప్రేక్షకులు ఆదరించేలా కనబడడం లేదు. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ.. చానాళ్లుగా బాక్సాఫీసు డల్ గా ఉండడంతో మహర్షికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అందులోను మహేష్ క్రేజ్ అలాంటిది. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా ఈ వీకెండ్ లో కలెక్షన్స్ బాగున్నా... సోమవారం నుండి డ్రాప్ అయ్యేలానే కనబడుతుంది. ఇప్పటికే శని ఆదివారాల్లో మహర్షి టికెట్స్ ఈజీగా దొరికేస్తున్నాయి.