తెలుగులో ప్రస్తుతం ‘బాహుబలి’, ‘నాన్ బాహుబలి’ పేర్లు మీదుగా కలెక్షన్లను లెక్కిస్తూ, చిత్ర విజయాలను అంచనా వేస్తున్నారు. బాహుబలి ఎంతో ప్రత్యేకమైన చిత్రం కాబట్టి దానిని మిగిలిన చిత్రాలతో పోల్చిచూడటం కష్టమే. ఇక నాన్‌బాహుబలి రికార్డులను మెగాస్టార్ చిరంజీవి తన దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీనెంబర్ 150’ ద్వారా సృష్టించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడే అయిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తాను నటించిన ‘రంగస్థలం’తో ఆ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నాన్‌బాహుబలి రికార్డు రంగస్థలం మీదనే ఉంది. ఈ చిత్రం విడుదలైన 20రోజులకు థియేటర్లలోకి వచ్చిన మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టరే అయినా కూడా రంగస్థలం కలెక్షన్లను అధిగమించలేకపోయింది.
ఇక రంగస్థలం సమయంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు పడలేదు. టిక్కెట్లను కూడా మామూలు ధరకే అమ్మారు. అయినా ఈ చిత్రం తన యూనిక్ అంశాలతో అద్భుతాలు చేసింది. అదే ‘మహర్షి’ విషయానికి వస్తే తెలంగాణలో ఉదయం 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో కూడా టిక్కెట్ల ధరలను రెట్టింపు చేసి 200 రూపాయలకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
అయినా ‘మహర్షి’కి మొదటి రోజు మిక్స్‌డ్‌టాక్ మాత్రమే వచ్చింది గానీ ‘రంగస్థలం’లాగా అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రాలేదు. అయినా టిక్కెట్లు, షోల పరంగా చూసుకుంటే ‘రంగస్థలం’కి లేని మినహాయింపులు ‘మహర్షి’కి ఉన్నాయి. మరి వీటిని సద్వినియోగం చేసుకుని ఈ చిత్రం ‘నాన్‌బాహుబలి’ రికార్డులు దక్కించుకున్న‘రంగస్థలం’ని అధిగమిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. ‘మహర్షి’ ఆ ఫీట్‌ని సాధించలేకపోతే మరలా ప్రభాస్ ‘సాహో’, మెగాస్టార్ ‘సై..రా’ల వరకు వెయిట్ చేయాల్సిందే.