నిజానిజాలను ఒప్పుకునే సాహసం అందరికీ ఉండదు. నిజాన్ని నిర్భయంగా స్టార్స్ అయినా ఒప్పుకుంటారేమోగానీ వారి వీరాభిమానులు మాత్రం అస్సలు సహించలేరు. ఇక నటులు వేరు స్టార్స్ వేరనేది నగ్నసత్యం. ఈ విషయాన్ని చాలా మంది ఒప్పుకుంటారు. స్వయానా రజనీకాంత్ వంటి సూపర్‌స్టారే తను కమల్‌హాసన్‌లా చేయలేనని, ఆయనతో తనని పోల్చవద్దని కోరాడు. నటులంటే ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి, తెర మీద పాత్ర తప్ప తాము కనిపించకుండా చేయడమే. దానికి నేడు అమితాబ్‌బచ్చన్ నుంచి అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌ల నుంచి కమల్‌హాసన్, విక్రమ్, తాజాగా విజయ్ సేతుపతి వంటివారిని చెప్పుకోవాలి. అలాగని మాస్ ఇమేజ్ ఏమీ ఊరకే రాదు. దానికి కూడా ఎంతో కష్టపడాలి. ‘ఆరాధన’ చిత్రం షూటింగ్ సమయంలో చిరంజీవి ‘స్వాతిముత్యం’లోని కమల్‌లా నటించాలని ప్రయత్నిస్తుంటే సుహాసిని మీరు రజనీ వంటి వారు.. మీరు మీ స్టైల్‌లో చేయమని చిరుకి సలహా ఇచ్చిందని ఓ సారి చిరునే ఒప్పుకున్నాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఓ విషయం కోలీవుడ్‌లో వివాదానికి కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందునా తమిళ తంబీలంటే మజాకా కాదు. విషయానికి వస్తే మలయాళ నటుడైన సిద్దిఖీ తాజాగా మాట్లాడుతూ, తమిళస్టార్ విజయ్ ‘సూపర్‌స్టార్ కావచ్చేమో గానీ సూపర్‌నటుడు మాత్రం కాదు. ఆయన్ని సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారేమో గానీ ఆయన గొప్ప నటుడేమీ కాదు. కేవలం అతడిని స్టార్‌డమ్ మాత్రమే నడిపిస్తోంది. నా దృష్టిలో గొప్పనటుడు, సూపర్‌స్టార్ అంటే కమల్‌హాసనే. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు ఉండటం మలయాళ చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు మాకెంతో సాయం చేస్తున్నారు. ప్రతి పరిశ్రమ అక్కడ ఉన్న సూపర్‌స్టార్స్‌ని బట్టి రాణిస్తుంది. అలాంటి వారి వల్లే మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు జీవిస్తున్నారు. కానీ తమిళ పరిశ్రమలో పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి... అని చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. విజయ్ అభిమానులు సిద్దిఖీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయినా సిద్దిఖీకే కాదు.. ఎవరికైనా తమకు నచ్చిన విషయం చెప్పే హక్కు ఉంది. మరి దానిని విజయ్ అభిమానులు గుర్తిస్తారో.. లేక వివాదాన్ని మరింత జటిలం చేస్తారో చూడాలి....!