తెలుగులో ఈవీవీ సత్యనారాయణ తనయులుగా ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌ల తెరంగేట్రం జరిగింది. తండ్రి ఉన్నంతకాలం ఆయన చిత్రాలలోనే కాకుండా బయటి చిత్రాలలో కూడా అల్లరినరేష్ హీరోగా దూసుకెళ్లాడు. కామెడీలో రాజేంద్రప్రసాద్ వారసునిగా పేరు తెచ్చుకుంటూ అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ చిత్రాలలో నటించడమే కాదు.. తనదైన కామెడీతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్యన్ రాజేష్‌కి మాత్రం ‘లీలామహల్‌సెంటర్, ఎవడిగోల వాడిది’ తప్ప పెద్దగా హిట్స్‌లేవు. తండ్రి మరణం తర్వాత ఆర్యన్‌రాజేష్ సంగతి పక్కనపెడితే అల్లరినరేష్ కూడా వరస ప్లాప్‌లు ఎదుర్కొన్నాడు.
మూసధోరణితో కూడా పేరడీ కామెడీతో ఆయన చిత్రాలు సరిగా ఆడలేదు. చాలాకాలం తర్వాత ఆర్యన్‌రాజేష్‌కి రామ్‌చరణ్-బోయపాటిల కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో సపోర్టింగ్‌రోల్ వచ్చింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆయన కథ మరలా మొదటికి వచ్చింది. ఇక అల్లరినరేష్‌కి మహేష్ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’లో కథకు కీలకమైన, కథను మలుపుతిప్పే పాత్ర వచ్చిందని విడుదలకు ముందే స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం ఒప్పుకోవడం అల్లరినరేష్ కెరీర్‌కి మేలు చేస్తుందా? లేదా? అనేది పక్కనపెడితే గతంలో సిద్దార్ద్, నవదీప్, ఆనంద్‌రాజా వంటి వారు పలువురు స్టార్స్ చిత్రాలలో కీలకమైన పాత్రలు పోషించిన వారికి వచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ లేదు. స్టార్ హీరోల చిత్రాలలో నటించడం వల్ల కొన్ని ప్లస్‌లు, మరికొన్ని మైనస్‌లు కూడా ఉంటాయి.
స్టార్స్ చిత్రాల ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ప్లస్ పాయింట్ కాగా, అందరి దృష్టి స్టార్ హీరోల మీదే ఉండటం అనేది మైనస్ అవుతుంది. మరి ‘మహర్షి’ చిత్రం మంచి విజయం సాధిస్తే ఇలాంటి పాత్రలే నరేష్‌కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరేష్‌లోని విభిన్ననటుడు ఇప్పటికే ‘గమ్యం, శంభో శివశంభో, నేను, ప్రాణం’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం ఉంది. మరి ‘మహర్షి’ చిత్రం అల్లరినరేష్‌కి సోలో హీరోగా కూడా వరుస అవకాశాలను తెచ్చిపెడుతుందా? లేదా? అనేది మాత్రం వేచిచూడాల్సివుంది.