ఒక సినిమా ఎందుకు విజయం సాధిస్తుంది? ఎందుకు ఫ్లాప్ అవుతుంది? ఏ చిత్రానికి ఎందుకు భారీ కలెక్షన్లు వచ్చాయి? మంచి చిత్రాలకు కూడా కలెక్షన్లు ఎందుకు రాలేదు? అనే విషయాలను ఎంత విశ్లేషకులు, నిపుణులైనా కొన్నిసార్లు చెప్పలేరు. ‘డిజె, సరైనోడు’ వంటి చిత్రాలకు ఆ స్థాయి కలెక్షన్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అదే ‘వినయ విధేయ రామ’, బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్, పిఎస్వీగరుడవేగ వంటి పలు చిత్రాలు ఎందుకు దారుణమైన ఫలితాలను అందుకున్నాయనేది మిస్టరీనే. ఇవే కాదు.. ఇటీవల కాలంలో తెలుగులో కూడా వైవిధ్యభరితమైన చిత్రాలను, ఫీల్‌గుడ్ చిత్రాలను బాగా ఆదరిస్తున్నా కూడా కొన్ని మాత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కలెక్షన్ల విషయంలో చతికిల పడుతున్నాయి.
ఇక విషయానికి వస్తే తాజాగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రం కంటెంట్, వైవిధ్యం, ఎమోషన్స్‌తో పోలిస్తే లారెన్స్ నటించిన ‘కాంచన 3’ చిత్రం ఏ విషయంలోనూ ‘జెర్సీ’తో సరి తూగలేదు. ‘జెర్సీ’ని చూసి కళ్లు చెమర్చని వారు లేరు. అదే ‘కాంచన 3’ చిత్రం చూసిన పలువురు మండే ఎండాకాలంలో నీళ్లలో కారప్పొడి కలిపి నడిరోడ్దు మీద బట్టలు లేకుండా తాగినట్లుగా ఉందని కామెంట్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే.. ఈ చిత్రం కంటెంట్‌తో సంబంధం లేకుండా ఏకంగా 100కోట్లకు పైగా కొల్లగొట్టి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. నిజానికి లారెన్స్ తన కెరీర్ మొదట్లో ‘మాస్, స్టైల్, డాన్’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలు తీశాడు.
ఇక ‘రెబెల్’ రొటీన్‌గా తీస్తే ఇది మాత్రం ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత ఈయన ముని సిరీస్‌ని ప్రారంభించి వరుసగా బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నాడు. తీసిన కథనే అటు తిప్పి ఇటు తిప్పి తీస్తున్నాడని, కంటెంట్‌లో కొత్తదనం లేదని, మూసధోరణిలో తీస్తున్నాడని ఇలా ఎన్నో విమర్శలు వస్తున్నా కూడా ‘ముని, కాంచన, గంగ, కాంచన 3’ ఇలా వరుస సీక్వెల్స్ అదిరిపోయే లాభాలను సాధిస్తున్నాయి. వాస్తవానికి సౌత్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రాల సీక్వెల్స్‌కి, లేదా వాటి టైటిల్స్‌కి 2,3 వంటి అంకెలను చేర్చి సీక్వెల్స్‌గా విడుదల చేసిన చిత్రాలకు ఎప్పుడు ఆదరణ లభించలేదు.
ఈ విషయంలో పవన్‌కళ్యాణ్, రవితేజ, రజనీకాంత్, ధనుష్, సూర్య, అల్లుఅర్జున్.. ఇలా అందరు చేతులు కాల్చుకున్నారు. మొత్తానికి ఇలా పలు విషయాలలో లారెన్స్ మాస్టర్ బ్యాడ్ సెంటిమెంట్స్‌ని తనదైన శైలిలో అధిగమించాడు. ఇక త్వరలో కాంచన చిత్రాన్ని లారెన్స్ బాలీవుడ్‌లో అక్షయ్‌కమార్ హీరోగా తీస్తూ ఉండటమే కాదు.. మరలా ‘కాంచన 4’కి శ్రీకారం చుట్టే పనిలో ఉన్నాడు.