మంచి సందేశాన్ని అందించే మహర్షి - మహేష్ బాబు
మహర్షి సినిమా చాలా ఇంటెన్స్ ఉన్న కథ. దీని తరువాత ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాను, అయితే అదే సమయంలో సుకుమార్ ఇంటెన్స్ తో కూడిన సీరియస్ కథను చెప్పాడు. అప్పుడే సీరియస్ కథ వద్దనుకుని అనిల్ రావిపూడి చెప్పిన ఎంటర్ టైనర్ చేయడానికి సిద్దమయ్యాను. ఈ విషయంలో సుక్కు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సుక్కు నాకు మంచి ఫ్రెండ్. అతనితో తప్పకుండా భవిష్యత్తులో సినిమా చేస్తా అని అంటున్నాడు మహేష్ బాబు ఆయన తాజాగా నటిస్తున్న మహర్షి చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో మహేష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా మహేష్ బాబుతో ఇంటర్వ్యూ ..
1. మహర్షి ని శ్రీమంతుడు సినిమాతో పోలుస్తున్నారు కదా ? మీరేమంటారు ?
శ్రీమంతుడు, మహర్షికి ఎక్కడ పోలికలు ఉండవు. ఈ రెండు కథలు దేనికదే భిన్నమైనవి. ఈ సినిమా చూస్తే ఆ డిఫరెన్స్ ఏమిటన్నది మీరే తెలుసుకుంటారు.
2. ఈ మహర్షి ఏమి చెప్పాలనుకుంటున్నాడు ?
ఈ కథను నాకు వంశీ నలభై నిముషాలు వివరించాడు. అతను చెప్పినప్పుడు నా పాత్ర నన్ను కట్టిపడేసింది. నా కెరీర్ లో ఇలా ఒక పాత్ర తాలూకు ప్రతి డీటెయిల్ ఎప్పుడు వినలేదు. ప్రతి ఎమోషన్, అతని బిహేవియర్ ఇలా ప్రతి ఒక్క విషయంలో వంశీ చూపించిన కేర్ సూపర్బ్. అయితే కథ విన్నాక బాగా నచ్చింది కానీ ఈ సినిమా చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. రెండేళ్లు కూడా పట్టొచ్చు మరి వెయిట్ చేస్తావా అని అడిగాను.. తాను ముందే చెప్పాడు ఈ కథను మీతో తప్ప ఎవరితో తీయను. ఈ పాత్రలో మిమ్మల్ని తప్ప ఎవరిని ఉహించను అని చెప్పాడు. చెప్పినట్టే రెండేళ్లు కాదు మూడేళ్లు నాకోసం వెయిట్ చేసాడు. నిజంగా అతనికి హ్యాట్సాఫ్ చెప్పాలి.
3. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన అంశం ఏమిటి ?
ఇందులో సమాజాన్ని ప్రభావితం చేసే ఓ మంచి పాయింట్ ఉంది. నా గత సినిమాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను ఎలాంటి మెసేజ్ అందించాయి.. అంతకంటే పవర్ ఫుల్ పాయింట్ కట్టిపడేసింది. ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతారు.
4. ఇందులో మీరు చాలా స్టైలిష్ గా డిఫ్ఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు.
నేను ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒకేలా ఉంటానని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం కొంత మేక్ ఓవర్ కూడా మార్చాను. స్పష్టంగా మాట్లాడడం. భిన్నంగా ఉండేలా ట్రై చేయడం లాంటివి ఈ పాత్రలో ఆ ఛాన్స్ దక్కింది. ఇందులో మూడు వేరియేషన్స్ లో కనిపిస్తాను. ఒకటి స్టూడెంట్, రెండు సీఈఓ, ముందు విలాగే నేటివిటీ. అది మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది.
5. ఈ సినిమాకోసం ట్రాక్టర్ దున్నడం, నాట్లు వేయడం లాంటి పనులు చేసారు? ఆ ఫీలింగ్ ఎలా ఉంది ?
నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ పాత్రకోసం అవన్నీ చేయాల్సి వస్తుంది.. కాబట్టి తెలుసుకుని చేశాను.
6. కాలేజీ స్టూడెంట్ గా బాగా ఎంజాయ్ చేసారా ?
స్టూడెంట్ గా బాగా ఎంజాయ్ చేశాను. ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ బాగుంటాయి. నేను కూడా ఆ పాత్రను బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు.
7. ఈ సినిమా విషయంలో సవాలుగా అనిపించే విషాయం ఏమిటి ?
ఇందులో కాలేజ్ స్టూడెంట్ పాత్రను తీసేయడం పెద్ద సవాలుతో కూడుకున్నది. చాలా కష్టం కూడా. బాడీ లాంగ్వేజ్ , డైలాగ్స్, నన్ను నేను చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. నిజానికి ఆ ఎపిసోడ్ విషయంలో కొంత నెర్వస్ గా ఉన్నాను కానీ దర్శకుడు వంశి ఇచ్చిన ఇంపుట్స్ తో బాగా చేశాను.
8. మీ కెరీర్ లో మీరు ఎమోషన్ గా భావించిన ఉత్తమ క్షణం ఏదైనా ఉందా ?
ఉత్తమ క్షణం అంటే .. మురారి సినిమా విడుదల రోజు మొదటి షో, నేను, నాన్న కలిసి హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో సినిమా చూసాము. సినిమా పూర్తయ్యాక నాన్న నా భుజం పై చేయి వేసి.. ఒక ఎమోషనల్ స్మైల్ ఇచ్చాడు. అది ఇప్పటి వరకు నేను మరచిపోని క్షణం.
9. మరి ఈ సినిమాను నాన్నగారు చూసారా ?
చూసారు. ఆయన సినిమా విషయంలో జెన్యూన్ రిజల్స్ ఇస్తాడు. మంచి విమర్శకుడు కూడా. మహర్షి విషయంలో నాన్న పూర్తీ సంతృప్తిగా ఉన్నాడు.
10. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరికొందరు దర్శకుల పేర్లు కావాలనే చెప్పలేదన్న విమర్శలు వస్తున్నాయి ?
నేనెప్పుడూ ఎవరిని టార్గెట్ చేయను. ఈ సినిమా విషయంలో వంశీని పొగిడాను తప్ప మరో దర్శకుడిని కార్నర్ చేస్తూ మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడిన మాటలను ఎవరో కాంట్రవర్సీ చేసి రాసేశారు. నిజానికి నా కెరీర్ లో గొప్ప చిత్రం పోకిరి, అలాగే నాకు చాలా ఇష్టమైన సినిమా 1 నేనొక్కడినే. సుకుమార్, పూరి జగన్నాధ్ ఇద్దరు నాకు మంచి మిత్రులు. వాళ్ళను నేను ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడలేదు.
11. సుకుమార్ తో సినిమా ఎందుకు సెట్ కాలేదు ?
సుకుమార్ రంగస్థలం సినిమా తరువాత నాకోసం ఓ కథ సిద్ధం చేసాడు. అయితే తాను కథ వినిపించినప్పుడు, అప్పటికే మహర్షి సినిమా చేస్తున్నాను. సుకుమార్ చెప్పిన కథ ఇంటెన్స్ తో కూడుకున్నది పైగా సీరియస్ కథ. నాకు సీరియస్ గా కాకుండా ఫుల్ ఎంటర్ టైనర్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది. అదే విషయం సుక్కుకి చెప్పా. తాను కూడా సరే అలాంటి కథ వస్తే చూడండి మనం తరువాత చేద్దామని చెప్పాడు. అప్పుడే అనిల్ రావిపూడి చెప్పిన కథ బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాను సెట్స్ పైకి ముందు తీసుకువస్తున్నా.
12. అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు ?
జూన్ చివర్లో మొదలవుతుంది. పక్కా ఫ్యామిలి ఎంటర్ టైనర్.
13. అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉంటుంది ?
ఈ సినిమాలో నరేష్ ది చాలా మంచి పాత్ర. వంశీ కథ చెప్పినప్పుడే అల్లరి నరేష్ పేరు చెప్పాడు. తాను పాత్రకు తగ్గట్టు బాగా చేసాడు.
14. హీరోయిన్ పూజా హెగ్డే గురించి ?
పూజా అందమైన అమ్మాయి. పైగా మంచి నటి కూడా. ఈ సినిమాలో కూడా చక్కగా చేసింది. తప్పకుండ తనకు మంచి ఫ్యూచర్ ఉంది.
15. మీరు కొత్త దర్శకులతో పనిచేయకపోవడానికి కారణం ?
కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలన్న ఆలోచన ఉంది. అయితే నాకోసం కొత్త దర్శకులు మంచి స్క్రిప్ట్ తో ఎవరు సంప్రదించలేదు. నేను కూడా కొత్త తరహా సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సరైన స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తా.
16. ఏఎంబి సినిమాస్ మల్టి ప్లెక్స్ గురించి ఏమి చెబుతారు ?
ఇది నా ఆరేళ్ళ కల. హైదరాబాద్ లో ఇండియాలోనే బెస్ట్ మల్టి ప్లెక్స్ ఉండాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనను ఆసియన్ సినిమాస్ వాళ్లకు చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఇండియా బెస్ట్ థియేటర్ అనుభూతి ప్రేక్షకులకు కలిగేలా అన్ని రకాల ఉన్నత టెక్నీకల్ విలువలతో ఇక్కడ మల్టి ప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అది నాకు ఒక రకంగా గర్వాంగా ఉంది.
17. మీ బ్యానర్ నుండి వరుస సినిమాలు చేస్తారని అంటున్నారు ?
అవును. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ విషయంలో నమ్రత అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. దాన్ని అందుకోవాలన్నది మా ప్రయత్నం.
18. మళ్ళీ మల్టి స్టారర్ సినిమాలు చేయడం లేదు ? కారణం ?
మల్టి స్టారర్ సినిమాలు చేయడం ఆషామాషీ కాదు. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ కథ నడిపించాలి. సీతమ్మ వాకిట్లో తరువాత ఆ తరహా స్క్రిప్ట్ నా దగ్గరికి రాలేదు. నేను కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి అందరి హీరోలతో సినిమాలు చేయాలనీ ఉంది. చూద్దాం.
19. తదుపరి చిత్రాలు ?
అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా జూన్ లో మొదలవుతుంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో కే ఎల్ నారాయణ నిర్మించే సినిమా ఒకటి ఉంటుంది. దానికి ఇంకాస్త సమయం పడుతుందేమో.