హీరోగా అక్షయ్‌కుమార్‌కి మంచి పేరుంది. సల్మాన్, షారుఖ్, అమీర్‌లా భారీ క్రేజ్ లేకపోయినా సైలెంట్ కిల్లర్‌గా వరుసగా విజయాలు సాధిస్తూ, 100కోట్ల క్లబ్‌లో ఎక్కువ చిత్రాలను నిలిపిన ఘనత అక్షయ్‌కుమార్‌కి దక్కుతుంది. ఇదే సమయంలో ఆయన ఓ పొరపాటు చేశాడు. రాజకీయాలలో వేలు పెట్టి నరేంద్రమోదీని ఇంటర్వ్యూ చేశాడు. పోనీ ఘాటైన ప్రశ్నలు అడిగాడా? అంటే అదీ లేదు. మీకు ఏది ఇష్టం? మీరేం కావాలని భావించారు? అంటూ నమో భజన చేశాడు. దీంతో బిజెపి యేతర పార్టీల కార్యకర్తలు మోదీపై కంటే అక్షయ్‌కుమార్‌నే టార్గెట్ చేశారు. ఇది చినికి చినికి గాలివానలా మారింది. తాజాగా సౌత్ హీరో, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న సిద్దార్ద్ ఇన్‌డైరెక్ట్‌గా మోదీని, అక్షయ్‌ని ప్రస్తావించకుండా సెటైర్లు వేశాడు. అవి బాగా సూటిగా తగిలేలా వ్యంగ్యంగా స్పందించాడు.
సిద్దార్ద్ మాట్లాడుతూ, ‘హేయ్ డోనాల్డ్ ట్రంప్.. మీకు ఒక సలహా... ఈసారి ఎన్నికలు ఎదుర్కొనే ముందు నాకు ఓ ఇంటర్వ్యూ ఇవ్వండి. మిమ్మల్ని మంచి మంచి ప్రశ్నలు అడుగుతాను. మీరు నిద్ర ఎలా పోతారు? ఎలాంటి పళ్లు తింటారు. మీ అందమైన శరీరానికి కారణం వంటి ప్రశ్నలు అడుగుతాను...’ అని సెటైర్లు వేశాడు. అంతేకాదు.. చివరలో కొసమెరుపులా అక్షయ్‌కుమార్ పౌరసత్వం గురించి కూడా వ్యంగ్యంగా స్పందించాడు. డోనాల్డ్ ట్రంప్ గారు.. నాకు ఇండియా పౌరసత్వం ఉంది.. ఫర్లేదు కదా..! అంటూ ఘాటుగా ముగింపు ఇచ్చాడు.
అక్షయ్‌కుమార్ తాజాగా మోదీని ఇంటర్వ్యూ చేశాడు. ప్రజాస్వామ్యం గురించి గొప్పగా లెక్చర్ తీసుకున్నాడు. కానీ ఎన్నికల్లో ఆయన భార్య ఓటు వేసింది గానీ ఆయన వేయలేదు. దానికి కారణం ఆయనకు కెనడా పౌరసత్వం ఉండటమే. ఆమధ్య అక్షయ్ కెనడాలో మాట్లాడుతూ, నా సొంతగడ్డ టొరంటో.. సినిమాలకు స్వస్తి చెప్పగానే కెనడా వచ్చి స్థిరపడతాను అని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్షయ్‌కుమార్ దేశభక్తిని ఇప్పుడు అందరు రెండు కళ్ల సిద్దాంతంతో పోలుస్తున్నారు.