ఎంత గొప్పనటి అయినా సత్తా ఉన్న పాత్రలు వస్తేనే తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోగలరు. అంతేగానీ రొటీన్ హీరోయిన్ పాత్రలు, హీరోగా ఓ పది రొమాంటిక్ సీన్స్, ఐదు పాటలు ఉండే పాత్రలు వస్తే ఎవరు ఏమీ చేయలేరు. ఈ విషయం ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవికి కూడా వర్తిస్తుంది. తమిళ చిత్రాలతో పరిచయం అయిన ఈ కోయంబత్తూర్ భామ మలయాళంలో ‘ప్రేమమ్’ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో చాలా మంది ఆమెని మలయాళీనే అని భావిస్తారు. ఇక తెలుగులో ఈమె శేఖర్‌కమ్ముల-దిల్‌రాజు-వరుణ్‌తేజ్‌ల ‘ఫిదా’ చిత్రంతో ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె సాయిపల్లవి కంటే ‘ఫిదా’ భానుమతిగానే ఎక్కువ గుర్తింపును తెచ్చుకుందనేది వాస్తవం.
ఆ తర్వాత కూడా దిల్‌రాజు నిర్మాతగా నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’ (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి), నాగశౌర్యతో ‘కణం’ వంటి చిత్రాలు చేసింది. ఇటీవలే ఈమె నటించిన శర్వానంద్ చిత్రం ‘పడి పడి లేచె మనసు’లో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఫ్లాప్ అయితే తన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ని కూడా వద్దని తన పెద్ద మనసు చాటుకుంది. త్వరలో ఆమె తన ఇష్టమైన హీరో సూర్య సరసన ‘ఎన్జీకే’లో నటిస్తోంది. దీంతో పాటు దగ్గుబాటి రానా హీరోగా ‘నీది నాది ఒకే కథ’ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందనున్న ‘విరాటపర్వం’కి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా, పొలిటికల్ సెటైరిక్ ఫిల్మ్‌గా ఇది రూపొందుతోంది.
వాస్తవానికి 1990లలో నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉండేది. పోలీసులకు, నక్సలైట్లకూ పోటాపోటీగా వార్ జరుగుతుండేది. కానీ కీలకమైన నక్సలైట్ నాయకులు మరణించడం వల్ల ప్రస్తుతం నక్సలైట్ ఉద్యమం నాటి స్థాయిలో లేదు. ఇక ఈ చిత్రంలో సాయిపల్లవి కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోకుండా నక్సలైట్‌గా మారే పాత్రలో నటిస్తోందని సమాచారం. మరి రానా పాత్ర ఏమిటి? అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. మొత్తానికి సాయిపల్లవికి అరుదైన నక్సలైట్ పాత్రను చేసే అవకాశం రావడంతో, దానిని వేణు ఊడుగుల ఎలా తెరకెక్కిస్తాడు? సాయిపల్లవి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండనుంది? అనే విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి.