- దర్శకుడు శంకర్.. రాజమౌళినే ఫాలో అవుతున్నాడా?
- శంకర్ ‘భారతీయుడు 2’ సంగతేంటి?
- కోలీవుడ్ ఆర్ఆర్ఆర్ వంటి చిత్రంలో హీరో లెవరు?
దక్షిణాదిలో బాపు, దాసరి, కె.బాలచందర్, మణిరత్నం వంటి దర్శకదిగ్గజాలు ఎందరో ఉన్నారు. కానీ నేడు మాత్రం సౌత్‌లో ఇద్దరు దర్శకులు దిగ్గజాలుగా వెలుగుతున్నారు. వారిద్దరే శంకర్, రాజమౌళి. ఇక రాజమౌళి ‘బాహుబలి’తో తన సత్తా చాటి దేశాన్ని షేక్ చేశాడు. దాంతో శంకర్ కూడా ‘బాహుబలి’ని మించిన బడ్జెట్‌తో రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ని, అక్షయ్‌కుమార్ వంటి బాలీవుడ్ స్టార్‌లతో ‘2.0’ చిత్రం తీశాడు. కానీ ఈ చిత్రం కూడా ‘బాహుబలి’ని ధీటుగా ఎదుర్కోలేకపోయింది. ‘బాహుబలి’కి వచ్చిన కలెక్షన్లు, సంచలనం ‘2.ఓ’కి రాలేదు. ఈ విషయంలో జక్కన్న తానే నెంబర్ వన్ అని నిరూపించుకున్నాడు.
ఇక ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో అసలు సిసలైన మల్టీస్టారర్‌ని స్టార్ట్ చేశాడు. దీనిని ప్రస్తుతానికి అందరు ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని పిలుస్తున్నారు. నిజానికి ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్ గానీ, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు గానీ దేశం మొత్తం గుర్తించే స్టార్స్ కాదు. వారి హవా కేవలం తెలుగుకే పరిమితం. రామ్‌చరణ్ బాలీవుడ్‌లో ‘జంజీర్’ చేసినా అది డిజాస్టర్. అలాంటి ఇద్దరు ప్రాంతీయ స్టార్స్‌తో రాజమౌళి చేస్తున్న సాహసం గురించే ఇప్పుడు జాతీయ అంతర్జాతీయంగా కూడా చర్చ సాగుతోంది.
మరోవైపు శంకర్ ‘2.O’ తర్వాత కమల్‌హాసన్ హీరోగా ‘భారతీయుడు2’కి శ్రీకారం చుట్టాడు. కొంత భాగం షూటింగ్ తర్వాత ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా కమల్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం ఇక ఉండదని పలువురు భావిస్తున్నారు. దాంతో శంకర్.. చియాన్ విక్రమ్‌తో పాటు తమిళ తలైవర్ విజయ్‌ల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ని చేయడానికి రెడీ అవుతున్నాడట.
నిజానికి దీనిని ‘భారతీయుడు 2’ తర్వాత చేద్దామని శంకర్ భావించినా, ‘భారతీయుడు2’ డైలమాలో పడటంతో శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. మొత్తానికి జక్కన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లానే శంకర్ తీయబోయే మల్టీస్టారర్‌కి కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. జక్కన్న ఏ నిర్ణయం తీసుకున్నా, అది కాకతాళీయమో, లేక కావాలనో గానీ శంకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ఉండటం విశేషం.