సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన మహేష్ అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మహర్షి’ థియేట్రికల్ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్, కామన్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఆడియో సీడీలను విక్టరీ వెంకటేష్, విజయ్‌దేవరకొండ, కొరటాలశివ సంయుక్తంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో పుట్టి పెరిగి టికెట్స్ కోసం ఆర్.టి.సి క్రాస్‌రోడ్స్‌లో దెబ్బలు తిని సినిమాలు చూసి హీరో ఇంట్రడక్షన్‌కి పేపర్స్ విసిరిన వాళ్లలో నేను ఒకడిని. ఒక ఆడియెన్ టికెట్ కొన్నప్పుడు ఏం కోరుకుంటారో నాకు తెలుసు. ఓ సూపర్‌స్టార్ మహేష్‌బాబుగారి ఫోటో ఉంటే సినిమాలో ఏం ఉండాలని కోరుకుంటారో నాకు తెలుసు. ‘ఒక్కడు’ సినిమా అప్పుడు థియేటర్లో నా ముందు మహేష్‌గారు సినిమా చూస్తున్నారు. ఈరోజు ఆయన్ని డైరెక్ట్ చేయడమే ఓ జర్నీ. గతంలో నేను ఎక్కడున్నా.. ఇప్పుడు ఎక్కడున్నాననేదే జర్నీ. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. ఈ కథకు సంబంధించి హరి, సాల్మన్ ఎప్పుడో బీజం వేశారు. ‘ఊపిరి’ చేసేటప్పుడు వాళ్లు చెప్పిన క్యారెక్టర్ ఎందుకో నాకు బాగా ఎక్కేసింది. తర్వాత నేను హరి, సాల్మన్‌గారు కలసి కథను తయారు చేశాం. హరిగారు నాకు దేవుడిచ్చిన సోదరుడు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నా చెయ్యి పట్టుకుని నడిపించారు. మోహనన్‌గారు షారూక్‌తో ‘డాన్’ సినిమా చేశారు. తర్వాత అమీర్‌తో ‘తలాష్’ చేశారు. మొన్న అంధాదున్ చేశారు. అలాంటి సెలబ్రిటీ సినిమాటోగ్రాఫర్‌తో ఈ సినిమాకు పనిచేశాను. ఆయన ఈ సినిమాకు ఏంజెల్. ఆయన అందించిన సపోర్ట్‌కి థ్యాంక్స్. శ్రీమణి చాలా డెప్త్‌తో పాటలు రాశారు. సినిమాలో ఓ సర్‌ప్రైజ్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం.
దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్‌గా నిలిచారు. 16 ఏళ్ల క్రితం ‘వర్షం’ సినిమాకు నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇక్కడి వరకు వచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించారు. నిర్మాతలు దిల్‌రాజుగారికి, దత్తుగారికి, పివిపి అన్నకు థ్యాంక్స్. మే 9న ఎప్పుడో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చూసి.. సినిమా అంటే పిచ్చి పుట్టింది. మళ్లీ మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకునే రోజుగా మే 9 నిలవనుంది. సినిమా కోసం మేం పడ్డ కష్టంపై నమ్మకంతో చెబుతున్న మాట ఇది. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానం. నరేష్‌గారు తన నటనతో నేను రాసుకున్న పాత్రకు ప్రాణం పోశారు. అలాగే పూజా హెగ్డేకు థ్యాంక్స్. మే 9న సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరిగే రోజని చెబుతున్నాను. ఈ సినిమా చేసే సమయంలో ఆయన అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన స్టార్‌గానే సూపర్‌స్టార్ కాదు.. హ్యుమన్ బీయింగ్‌గా కూడా సూపర్‌స్టారే. నేను ఎప్పుడైనా ప్రెషర్ ఫీలయితే ఆయన నా పక్కన కూర్చుని ధైర్యం చెప్పారు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయనతో మంచి స్నేహితుడ్ని, సోల్‌మేట్‌ను చూసుకున్నాను. నేను కథ చెప్పే రోజునే మీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు అభిమానుల సమక్షంలో ప్రామిస్ చేస్తున్నాను. ఈ జర్నీలో కామాస్ ఉంటాయే కానీ.. ఫుల్‌స్టాప్స్ ఉండవని మెసేజ్ పెట్టారు. అది నిజం. ఇదొక కామా మాత్రమే. ఆయన అందించిన సపోర్ట్‌కి థ్యాంక్స్’’ అన్నారు.