‘రాజకుమారుడు, ఒక్కడు, మురారి, అతడు, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ ఇవి తన కెరిర్‌లో టాప్ చిత్రాలని, తనను నిలబెట్టిన గొప్ప చిత్రాలని సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేదికపై తెలిపాడు. ఒక్కసారి ఈ లిస్ట్ చూస్తే ఏదో మిస్సయిందని అనిపిస్తుంది కదా..! ఏదో ఏంటి ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. వాడే పండుగాడు’.. మరిచిపోయే డైలాగా ఇది. మహేష్ మరిచిపోయే చిత్రమా అది. కానీ మరిచిపోయాడు. తనని సూపర్ స్టార్‌ని చేసిన ‘పోకిరి’ చిత్రాన్ని ట్విట్టర్‌కే పరిమితం చేశాడు మహేష్.
వాస్తవానికి మహేష్ తన సినిమాల ప్రస్తావన గురించి చెప్పాలి అంటే.. ముందుగా చెప్పాల్సిన పేరు ‘పోకిరి’ చిత్రమే అవుతుంది. అంతగా మహేష్, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పింది. అలాంటిది ‘పోకిరి’ చిత్ర ప్రస్తావనే తేకుండా మహేష్ స్పీచ్ నడిచిందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఎందుకంటే అదే వేదికపై మహేష్ కంటే ముందు మాట్లాడిన రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కూడా ఆ సినిమాలోని డైలాగ్‌ను పదే పదే అభిమానులతో చెప్పించాడు. అయినా మరిచిపోయానంటూ మహేష్.. ‘పోకిరి’ గురించి ట్వీట్‌తో సరిపెట్టేశాడు.
ఈవెంట్ ముగిసిన తర్వాత ట్విట్టర్‌లో ‘‘నేను నా స్పీచ్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి మరచిపోయాను. నా 25 సినిమాల జర్నీలో ‘పోకిరి’ చిత్రం నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది. ‘పోకిరి’ సినిమాను నాతో చేసిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమది’’ అని సందేశం పంపాడు. సరే మహేష్ మరిచాడనే అనుకుందాం. కానీ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేదికపై మహేష్ చేసిన దర్శకులందరితో ఓ వీడియోను ప్రదర్శించారు. అందులో కూడా పూరి జగన్నాథ్‌ను మిస్ చేశారు. మరి దీనిపై మహేష్ ఏమంటాడో.. తెలీదు కానీ.. జనం మాత్రం ‘జనగణమన’ ఎఫెక్ట్ అంటూ చర్చించుకుంటుండటం విశేషం.