టాలీవుడ్ లో ఈ ఏడాది ఓపెనింగ్ నుండి నెలకో సినిమా మాత్రమే హిట్ అవుతూ ప్రేక్షకులను కలవరపెట్టాయి చాలా సినిమాలు. భారీ బడ్జెట్ చిత్రాలైనా, చిన్న చిత్రాలైనా మంచి అంచనాలతో బాక్సాఫీసు వద్దకు వచ్చిన.. సినిమాలన్నీ తుస్ మనడంతో ప్రేక్షకులు బోలెడంత బోర్ ఫీల్ అయ్యారు. జనవరిలో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తో సరిపెట్టుకున్న ప్రేక్షకులను.. ఫిబ్రవరిలో ఒక్క సినిమా కూడా సంతృప్తి పర్చలేకపోయింది. ఇక మార్చిలో 118 తప్ప ప్రేక్షకులను పడేసిన సినిమా ఒక్కటి లేదు.
కానీ ఏప్రిల్ మొదలైంది మొదలు... హిట్స్ తో టాలీవుడ్ కళకళలాడిపోతుంది. ఏప్రిల్ 5 న నాగ చైతన్య - సమంత - దివ్యంకా కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కిన మజిలీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకుల కరువు తీర్చేసింది. సమంత శ్రావణిగా, చైతు పూర్ణ పాత్రలో నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 12 న సాయి తేజ్ - కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురేజ్‌ల చిత్రలహరి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది. ఇక ఏప్రిల్ 19 న నాని జెర్సీతో బాక్సాఫీసుని అల్లాడించాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నాని - శ్రద్ద శ్రీనాధ్ జంటగా నటించిన జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. క్రికెట్ ని, మధ్యతరగతి జీవితాన్ని గౌతమ్ తిన్ననూరి బ్యాలెన్సుడ్ గా చూపించిన తీరుకి ప్రేక్షకులు పడిపోయారు.
మరి జెర్సీకి పోటీగా రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 కూడా బాక్సాఫీసు బరిలోకి దిగింది. ఇక కాంచన 3 నెగెటివ్ టాక్ తోనే 100 కోట్లు కొల్లగొట్టింది. మరి ఇంకా ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సీత వాయిదా పడింది. ఇక అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏప్రిల్ చివరి వారంలో విడుదలై సునామిలా భారీ హిట్ అయ్యింది. ఇప్పటికే అవెంజర్స్ ఎండ్ గేమ్ హావ కొనసాగుతుంది. మరి ఏప్రిల్ లో విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాయి. అలాగే ఆయా హీరోలు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.