ఇటీవల కాలంలో వివాహం చేసుకుని నటనకు దూరం అయిన నటీనటులు మరలా రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకానొక దశలో వారు పరిశ్రమలో స్టార్స్‌గా వెలుగొందిన కారణంగా వారు మరలా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణ దొరుకుతుంది. ఇప్పటికే నదియా, ఖుష్బూ, ఇంద్రజ, స్నేహ, రంభ, రాశి వంటివారు ఎందరో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు. ఇక విషయానికి వస్తే ప్రియా వాసుదేవ మణియర్ అలియాస్ ప్రియమణి ముస్తాఫిర్ రాజ్‌ని వివాహం చేసుకుని కొంతకాలం వెండితెరకు దూరం అయింది. ఈమె మంచి అందగత్తె మాత్రమే కాదు.. అద్భుతమైన నటి కూడా.
‘పరుత్తి వీరన్’ అనే చిత్రానికి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. నిజానికి ఈమె 2003లో వల్లభ్ హీరోగా వచ్చిన ‘ఎవరే అతగాడు’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో చాలా కాలం చాన్స్‌లు రాలేదు. ఆ తర్వాత మాత్రం ఆమె ‘పెళ్లైన కొత్తల్లో, యమదొంగ, నవవసంతం, కింగ్, ద్రోణ, మిత్రుడు,’ ఇలా పలు చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ‘బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్‌తోనే కాదు.. జూనియర్ ఎన్టీఆర్ వంటి యంగ్‌స్టార్స్ సరసన కూడా ఆమె నటించింది.
తాజాగా ఆమె దగ్గుబాటి రానా-సాయిపల్లవి జంటగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘విరాట పర్వం 1992’ ఓ కీలకపాత్రకు ఎంపిక అయింది. ఈ చిత్రానికి వేణు ఉదుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం మొదట రాములమ్మ విజయశాంతిని సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పింది. తర్వాత టబుని సంప్రదించారు. ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. తాజాగా ఇందులో ప్రియమణి కూడా నటిస్తోంది. మరి ‘టబు’తో పాటు ప్రియమణి కూడా ఇందులో నటిస్తోందా? లేక టబు స్థానంలో ప్రియమణి నటిస్తోందా? అనేది వేచిచూడాల్సివుంది....! ఈ చిత్రం సక్సెస్ అయితే ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ కూడా జోరు పెరుగుతుంది. తెలుగు తెరకు మరో క్యారెక్టర్ ఆర్టిస్టు లభించినట్లు అవుతుంది.