బోయపాటి శ్రీను కెరీర్‌లో దమ్ము వంటి ఫ్లాప్ ఉన్నా ఆ చిత్ర సమయంలో కూడా రాని విమర్శలు ఇటీవల సంక్రాంతికి విడుదలైన రామ్‌చరణ్ వినయ విధేయ రామ కి వచ్చాయి. ఈ చిత్రంపై జరిగిన ట్రోలింగ్ మామూలుగా లేదు. దమ్ము ఫ్లాప్ తర్వాత కూడా బోయపాటికి అవకాశాలు వెత్తుకుంటూ వచ్చాయి. కానీ వినయ విధేయ రామ తర్వాత మాత్రం బోయపాటి అంటేనే స్టార్ హీరోలు మొహం చాటేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్ జరపడం, అనుకున్న బడ్జెట్ కంటే రెండు మూడింతలు పెంచడం, మితిమీరిన హీరోయిజం వంటివి ఆయన సొంతం. చివరకు ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లతో తీసిన జయ జానకి నాయకా చిత్రం కూడా ఓవర్ బడ్జెట్ వల్ల కమర్షియల్ ఫ్లాప్‌గా నిలిచింది.
ఇక వినయ విధేయ రామ తర్వాత బోయపాటి ఏపీలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు టిడిపి తరపున ప్రచార చిత్రాలు తీశాడు. మరోవైపు బాలయ్య హిట్ ఫ్లాప్‌లని లెక్కచేయడు. ఒకసారి కమిట్ అయితే అదే మాటకు కట్టుబడి ఉంటాడు. అందుకే ఆయన పలు ఫ్లాప్ దర్శకులతో కూడా పనిచేశాడు. కానీ విచిత్రంగా వినయ విధేయ రామ తర్వాత ఫలితం పక్కనపెట్టి తనని నమ్మిన బోయపాటికి బాలయ్య చాన్స్ ఇస్తాడని, అందులో ఆయన రాజీ పడడని అందరు భావించారు. కానీ చిత్రంగా అది జరగలేదు. బాలయ్య తన తదుపరి చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్‌కి ఇచ్చాడు. సి.కళ్యాణ్ నిర్మాత కాగా, పోయిన ఏడాది సంక్రాంతి కానుకగా పెద్దగా పోటీ లేకపోవడంతో వీరి కాంబినేషన్‌లో వచ్చిన జైసింహ కమర్షియల్‌గా మంచి హిట్టే అయింది. పరిస్థితి ఇలా సడన్‌గా మారడంతో బాలయ్య చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్న బోయపాటి ఆశలు అడియాసలయ్యాయి.
ఈయన బాలయ్యకి చెప్పిన కథకు బడ్జెట్ 50కోట్లు అవుతుందని చెప్పాడని, ఎన్టీఆర్ బయోపిక్‌లతో తీవ్ర నిరాశలో ఉన్న బాలయ్య అంత పెద్ద బడ్జెట్ తనకు వర్కౌట్ కాదని నిర్ణయించుకున్నాడట. దాంతో బోయపాటి శ్రీను ఎలాగైనా అతి తక్కువ బడ్జెట్‌తో పెద్దగా పేరు లేని హీరోని తీసుకుని, కంటెంట్ బలంతో ఆ చిత్రాన్నిహిట్ చేయాలని భావిస్తున్నాడట. ఇదే జరిగి, ఈ మీడియం బడ్జెట్ చిత్రం హిట్టయితే మరలా పెద్ద స్టార్స్ తనకోసం తప్పకండా ఎదురుచూసి పూర్వవైభవం వస్తుందనే నమ్మకంతో బోయపాటి ఉన్నాడని తెలుస్తోంది. ఏదిఏమైనా మరలా బోయపాటికి బాలయ్యతో చాన్స్ వచ్చే ముందే బోయపాటి మరలా తనంటే ఏమిటో నిరూపించుకునే పనిలో ఉన్నాడని సమాచారం.