స్టార్ హీరోల చిత్రాలంటే వారి ఇమేజ్‌కి, క్రేజ్‌కి, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగా పవర్‌ఫుల్ టైటిల్ పెట్టాలని భావిస్తారు. మరీ టైటిల్ దొరక్కపోతే సినిమాలో హీరో క్యారెక్టర్ పేరునే టైటిల్‌గా పెట్టి పవర్‌ఫుల్‌నెస్ నింపాలని భావిస్తారు. కానీ పాతకాలపు టైటిల్స్ కొన్నింటిని గమనిస్తే కవితాత్మకంగా సాగే పదాలలో కూడా ఎంతో పవర్ ఉంటుంది. ఇక విషయానికి వస్తే హీరోల రేంజ్‌ని బట్టి టైటిల్స్‌ని పెట్టాలి? అనే ఫార్ములాకి బ్రేక్‌నిచ్చింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్‌కళ్యాణ్‌ల అత్తారింటికి దారేది టైటిలే. ఈ టైటిల్ పెట్టినప్పుడు అందరు వింతగా మాట్లాడుకున్నారు. అత్తారింటికి దారేది అనే సాఫ్ట్ టైటిల్ పవన్ చిత్రానికి పెట్టడంపై అభిమానుల్లో పెద్ద చర్చ కూడా సాగింది. చిన్నల్లుడా..మజాకా అనే టైటిల్ పెట్టినా బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ సినిమా స్టోరీకి అత్తారింటికి దారేది నే బాగుంటుందని త్రివిక్రమ్ భావించడం, దానికి పవన్ ఒప్పుకోవడం నిజంగా ఎంతో గట్స్‌తో కూడిన నిర్ణయమే.
ఇక ఆ తర్వాత కాస్త టైటిల్స్‌లో తేడాలు వచ్చాయి. నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, రంగస్థలం వంటి టైటిల్స్‌ని కూడా స్టార్ హీరోల చిత్రాలకు పెడితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ టైటిల్స్ వల్ల ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్‌కి కూడా ఆయా సినిమాలు బాగా రీచ్ అయ్యాయి. ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో మహేష్‌బాబుది ఓ ప్రత్యేక స్టైల్. ఈయన అతడు, పోకిరి, ఒక్కడు, దూకుడు, ఆగడు ఇలా మూడు అక్షరాల టైటిల్స్‌కి ఓటేస్తూ వచ్చాడు. మధ్యలో ఖలేజా, స్పైడర్ తరహా దెబ్బలు తగిలాయి. తాజాగా వస్తున్న మహర్షి కూడా ఈ మూడక్షరాల సెంటిమెంట్‌తోనే వస్తూ ఉండటం విశేషం.
మరోవైపు మహేష్ 26వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడిది టైటిల్స్ పెట్టడంలో మరో స్టైల్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 ఇలా పరభాషా పేర్లను టైటిల్స్‌గా పెట్టుకుని అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన మహేష్ బాబు హీరోగా దిల్‌రాజు-అనిల్ సుంకరలు నిర్మించే చిత్రానికి సరిలేరు నీకెవ్వరు అనే టైటల్‌ని స్క్రిప్ట్ దశలోనే అనుకున్నాడట. ఈ చిత్రం అలనాటి ఎన్టీఆర్ హీరోగా నటించిన కంచుకోట చిత్రం సూపర్‌హిట్ సాంగ్ పల్లవిలో వస్తుంది. నిజానికి ఈ టైటిల్ వెనుక ఎంతో పవర్ కూడా ఉంది. నీకెవ్వరు సరిరారు.. నీకు నువ్వే సాటి అనే అద్బుతమైన హీరోయిజంని ఎలివేట్ చేసే టైటిల్ ఇది. ఇలాంటి టైటిల్ అయితే మహేష్‌కి ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాదు.. దిల్‌రాజుకి కూడా ఇలాంటి అభిరుచి ఉన్న టైటిల్స్ ఇష్టం. గతంలో ఆయన మహేష్, వెంకీ చిత్రానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు అని పెట్టి కొత్తదనానికి నాంది పలికిన ఘనత ఉంది. మరి ఇదే వర్కింగ్ టైటిల్ సినిమాకి కూడా ఖరారైతే సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి.