నువ్వు తోపురా సినిమా కోసం రెండేళ్ల పాటు శ్రమించామని, మా కష్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దని అన్నారు దర్శకుడు హరినాథ్‌బాబు. మే 3న విడుదలకానున్న నువ్వు తోపురా సినిమా ప్రమోషన్స్ నిమిత్తం గుంటూరు వెళుతున్న క్రమంలో చిత్రబృందం ప్రయాణిస్తున్న కారు మంగళగిరి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హీరో సుధాకర్ కోమాకులతో పాటు యూనిట్ సభ్యులు గాయాలపాలయ్యారు. వీరి కారు ఢీకొని ఓ కార్మికురాలు మృతిచెందింది. ఈ ప్రమాదంపై ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం స్పందించింది. ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
సహనిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ.. కమర్షియల్ ఈవెంట్ కోసం గుంటూరు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హీరో సుధాకర్ గాయాలపాలయ్యారు. సినిమా విడుదల అవుతుందన్న ఎక్సైట్‌మెంట్‌లో ఉన్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం షాక్‌కు గురిచేసింది అని అన్నారు.
దర్శకుడు హరినాథ్‌బాబు మాట్లాడుతూ.. ఇంకా బాధలోనే ఉన్నాం. భగవంతుడి ఆశీస్సుల వల్లే క్షేమంగా బయటపడ్డాం. సీటుబెల్ట్ మమ్మల్ని రక్షించింది. మా తప్పిందం లేకపోయినా ఓ నిండు ప్రాణంపోవడం మమ్మల్ని కలిచివేసింది. ప్రమాదంలో మరణించిన లక్ష్మి కుటుంబానికి ఆర్థికం సహాయం చేస్తాం. ఏం జరిగిందో తెలుసుకోకుండా హీరో కారు నడుపుతున్నాడని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలతో మా రెండేళ్ల కష్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దు అని చెప్పారు.
హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కారులో నేను ప్యాసింజర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నా కళ్లకు, చేతులతో పాటు తలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో షాక్‌లో ఉన్న సమయంలో కారును నేనే డ్రైవ్ చేశానంటూ కొందరు వార్తలు రాశారు. ఇలా రాయడం సరికాదు. ఈ వార్తలు చూసి అమెరికాలో ఉన్న నా భార్య బాధపడింది. ఇలాంటి వార్తలతో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిత్యాశెట్టి, నిర్మాత శ్రీకాంత్, ఎడ్మండ్‌రోజ్ తదితరులు పాల్గొన్నారు.