తెలుగులో ఆ నలుగురిలో నిర్మాత డి.సురేష్‌బాబు కూడా ఒకడు. ఈయన తన తండ్రి రామానాయుడు బతికున్నంతకాలం వరసగా వెంకటేష్, తరుణ్‌లతో పాటు పలువురితో చిత్రాలు తీస్తూ వచ్చాడు. అలాంటిది తండ్రి మరణం తర్వాత వెంకటేష్ చిత్రం అంటే ఏదో ఒక భాగస్వామిని చూసుకుంటున్నాడు. మరోవైపు చిన్న చిత్రాలు తీసే నిర్మాతలకు అండగా నిలుస్తూ వాటి విడుదల మీదనే శ్రద్ద పెడుతున్నాడు గానీ తానే పెద్ద చిత్రాలను సోలోగా తీయడం మానేశాడు. భవిష్యత్తులో గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రానా హీరోగా ‘హిరణ్యకస్యప’ తీస్తానని అంటున్నాడే గానీ ఆయన మనసు మాత్రం ఇండస్ట్రీలో మంచి చిన్నచిత్రాలు ఏవీ అనే కోణంలోనే సాగుతున్నాయి. విజయ్‌దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లిచూపులు’తో పాటు ‘కేరాఫ్‌కంచరపాలెం’ వంటి చిత్రాలను రిలీజ్ చేశాడు.
సురేష్‌బాబు అండగా, రానా సమర్పణలో కేరాఫ్ కంచరపాలెం విడుదల కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి మంచే జరిగింది. మంచి చిత్రాలతో తమను సంప్రదించే వారి సినిమాల విడుదలకు సాయం చేయడం, మంచి థియేటర్లు లభించేలా చేయడంతో పాటు ఆర్ధికసాయం కూడా చేస్తూ మంచి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ప్రస్తుతం ఏకంగా డజను చిన్న చిత్రాలకు సురేష్‌బాబు అండ దండ లభించడంపై అన్ని చోట్లా ఆసక్తికర చర్చసాగుతోంది. ఇందులో ఆరు విడుదలకు రెడీగా ఉన్నాయి. సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓ బేబీ’, అల్లుశిరీష్ ‘ఎబిసిడి’, విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ -జీవితల చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ‘దొరసాని’, మలయాళ ‘అంగామళై డైరీస్’కి తెలుగు రీమేక్‌గా వస్తున్న ‘ఫలక్‌నుమా దాస్’, పద్మశ్రీ చింతకింది మల్లేశం బయోపికక్ ‘మల్లేశం’, ‘మెంటల్ మదిలో’ టీమ్ తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘బ్రోచెవారెవరురా’.... ఇలా ఈ చిత్రాలన్ని సురేష్‌బాబు సమర్పణలో రూపొందుతున్నాయి.
నిజానికి ఇలాంటి చిత్రాలను సురేష్‌బాబు అండగా ఉండటం వల్లే ప్రేక్షకులలో ఆసక్తి, మంచి థియేటర్లు, ఓపెనింగ్స్ వస్తాయి. అయితే ఎంతో కాలంగా డి.సురేష్‌బాబుపై ఓ విమర్శ ఉంది. ఆయన తన భాగస్వాములను తన తప్పుడు లెక్కలతో బోల్తాకొట్టిస్తాడని అంటారు. గోపాల గోపాల సమయంలో కూడా అదే జరిగిందని చెబుతారు. ఏదిఏమైనా కాస్త లెక్కల్లో ఖచ్చితంగా ఉంటే సురేష్‌బాబు చేస్తున్నది ఎంతో మంచి పని అనే చెప్పాలి.