తెలుగులో వైవిధ్యభరితమైన చిత్రాలను చేసే యంగ్ హీరోగా నిఖిల్ సిద్దార్ద్‌కి మంచి పేరుంది. హ్యాపీడేస్‌తో మొదలుపెట్టి మధ్యలో యువతతో హిట్ కొట్టి స్వామి..రారా నుంచి దూసుకుపోతున్నాడు. స్వామి రా..రా.., కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి భారీ హిట్ కొట్టాడు. మధ్యలో శంకరాభరణం ఒక్కటి దెబ్బకొట్టింది. కేశవ, కిర్రాక్‌పార్టీలతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం తమిళ ‘కణితన్’ని తెలుగులో రీమేక్ చేస్తూ ఠాగూర్ మధు అండతో వస్తున్నాడు. జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో కెమెరా మెన్ గంగతో రాంబాబు మినహా చాలా కాలం తర్వాత వస్తున్న ఈ చిత్రానికి మొదట ‘ముద్ర’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ అదే టైటిల్‌ని వేరే వారు రిజిష్టర్ చేయించడంతో తన క్యారెక్టర్ పేరు అయిన ‘అర్జున్ సురవరం’గా వస్తున్నాడు.
ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన గత ఆరేడు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తోంది.. మే1న విడుదల ఖాయమన్నాడు. కానీ అంతలో ‘ఎవేంజర్స్’ రూపంలో అడ్డు వచ్చిపడింది. ఈ విషయాన్ని యూనిట్ దాచుకోలేదు. కేవలం ఎవేంజర్స్ పోటీని తట్టుకోలేకనే వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అయితే పెద్దనోట్ల రద్దుతో పాటు పలు పెద్ద చిత్రాల సమయంలో కంటెంట్‌లో దమ్మున్న చిత్రాలు వస్తే మంచి విజయం సాధిస్తాయని ఎక్కడికిపోతావు చిన్నవాడాతో పాటు పలు చిత్రాల ద్వారా నిఖిల్ నిరూపించాడు. మరి ఎవేంజర్స్‌ని చూసి మరీ ఇంతలా భయపడాలా? అనే అనుమానం రాకమానదు.
కానీ నిజానికి మన తెలుగు రాష్ట్రాలలోని మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అన్నింటిని ఎవేంజర్స్‌కే కేటాయించారు. అడ్వాన్స్ బుకింగ్‌కి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. దాంతో వీకెండ్ తర్వాత కూడా టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ పరిస్థితి 100శాతం ఆక్యుపెన్సీ వచ్చే ఎవేంజర్స్‌ని కాదని అర్జున్ సురవరంకి మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్‌లు లభించలేదు. ఇక సింగిల్ స్క్రీన్లలో ఇప్పటికీ మజిలీ, జెర్సీ, కాంచన3 వంటివి స్టడీగానే ఉన్నాయి. ఇలా కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్లుగా అర్జున్ సురవరం వాయిదాకు అన్ని కారణాలు ఉండటం మేకర్స్‌ని బాగా ఇబ్బంది పెట్టడంతో రిస్క్ ఎందుకని మరో డేట్ చూసుకుంటున్నారు.