తెలుగులో అభిరుచి ఉన్న నిర్మాతల్లో ముందుగా చెప్పుకోవాల్సింది దిల్‌రాజు గురించి. ఆయనకు కథల ఎంపిక, కథనంతో పాటు అన్ని శాఖలపై పట్టుంది. కాబట్టే సరైన దర్శక, హీరోలను ఎంచుకుంటూ నిర్మాతగా తన అభిరుచికి తగ్గ సినిమాలు తీస్తూ వరుస హిట్స్ సాధిస్తున్నాడు. అయితే దిల్‌రాజు సినిమా ఎంత పెద్ద హిట్ అయినా అందులో మేజర్ వాటా దిల్‌రాజుకే వెళ్తోంది. ఇండస్ట్రీలోనే కాదు.. సామాన్య ప్రేక్షకుల్లో కూడా దిల్‌రాజు చెప్పే మార్పులు చేర్పులు, దర్శకులకు ఆయనిచ్చే సూచనల వంటివి ఎక్కువగా విజయాలకు దోహదం చేస్తాయనే టాక్ ఉంది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం దిల్‌రాజు తమిళంలో ఫీల్‌గుడ్ మూవీగా వచ్చి అద్భుతమైన విజయం సాధించిన విజయ్‌సేతుపతి-త్రిషల 96 ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. వేరే దర్శకుడిని కాకుండా సినిమాలోని ఫీల్ మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఓరిజినల్ వెర్షన్ దర్శకుడు ప్రేమ్ కుమార్‌కే దర్శకత్వ బాధ్యతలు ఇచ్చాడు. తమిళంలో ఈ చిత్రం స్లోగా సాగుతుందని, దానిని స్పీడ్ చేయాలని, అలాగే తెలుగుకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడైతే బాగుంటుందని చెప్పడంతో పాటు దర్శకునికి రాజు గారు పలు సూచనలు చేశారట. కానీ దర్శకుడు మాత్రం దిల్‌రాజు చెప్పిన మార్పులు చేస్తే సినిమాలోని అసలు ఫ్లేవర్‌మిస్ అయి ఫీల్ పోతుందని భీష్మించుకుని కూర్చున్నాడని సమాచారం.
దాంతో దిల్‌రాజు ఇక చేసేది లేక ఆయన కెరీర్‌లో మొట్ట మొదటిసారిగా 96 చిత్రం విషయంలో తానేమీ పట్టించుకోనని, దర్శకుడు కోరుకున్న విధంగా చిత్రాన్ని తీసి తనకు హిట్ ఇవ్వాలని చెప్పి సైలెంట్ అయిపోయాడంటున్నారు. మరి ఇది దర్శకునిపై ఉన్న నమ్మకమా? లేక తన సూచనలను దర్శకుడు పట్టించుకోకపోవడం వల్ల తీసుకున్న నిర్ణయమా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి సంగీత దర్శకుని విషయంలో కూడా దిల్‌రాజు మాటను తోసిపుచ్చి ప్రేమ్‌కుమార్ ఒరిజినల్ వెర్షన్ సంగీత దర్శకుడు గోవింద్ వసంత్‌నే తీసుకున్నాడు. ఇక ఇందులో శర్వానంద్, సమంతలు నటిస్తున్న విషయం తెలిసిందే. సో.. కేవలం సినిమాకి పెట్టుబడి పెట్టే నిర్మాతగా తప్పితే ఈ చిత్ర జయాపజయాల విషయంలో దిల్‌రాజుది ఏమీ లేదని, పూర్తి బాధ్యత దర్శకుడిదేనని చెప్పాలి.