నేటి తరానికి నవలా రూపంలో సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’
పద్మభూషణ్ - సూపర్ స్టార్, నటశేఖర హీరో కృష్ణ నిర్మించి నటించిన పద్మాలయా మూవీస్ భారీ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ అప్పట్లో ఘనవిజయం సాధించి ఎన్నో ప్రశంశలు పొందిన నేపథ్యంలో కథా రచన చేసిన కీ.శే. శ్రీ ఆరుద్ర రచనా రూపకల్పనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, హీరో కృష్ణ సీనియర్ అభిమాని, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారి శ్రీ విజయ్ రీ-మిక్స్ నవలారూపంలో డిజైన్ చేసి ముద్రించగా, హీరో కృష్ణ ఈ నవలను పద్మాలయా కార్యాలయంలో విడుదల చేసి, చిత్ర నిర్మాత - సోదరుడు శ్రీ ఘట్టమనేని అదిశేషగిరిరావుకు తొలి ప్రతిని, రెండవ ప్రతి ని నవలా రచయిత శ్రీ విజయ్ సోదరుడు శ్రీ లక్ష్మీ నరసింహారావుకు అందజేశారు.
మా పద్మాలయా పతాకంపై నిర్మించిన రెండో చిత్రమైన ‘మోసగాళ్లకు మోసగాడు’ సంచలన విజయం సాధించి, తెలుగులో తొలి భారీ కౌబాయ్ వర్ణ చిత్రంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్ర కథా రచయిత శ్రీ ఆరుద్ర, ఛాయాగ్రాహకుడు శ్రీ వి. యస్. ఆర్. స్వామి ఈ చిత్ర విజయానికి కీలకమైన సాంకేతిక నిపుణులుగా నిలిచారని, ఈ చిత్ర కథని తిరిగి రీ-మిక్స్ నవలా రూపంలో డిజైన్ చేయాలని నా అభిమానిగా రచయిత శ్రీ విజయ్ సంకల్పించటం గర్వంగా ఉందని, నాటి నుంచి నేటివరకు, ఇప్పటి తరం అభిమానులకు ఈ నవల నచ్చి, ఈ ప్రయత్నాన్ని హర్షించి ప్రోత్సహిస్తారని హీరో కృష్ణ ఆశాభావం వ్యక్తం చేసారు.
చిత్ర నిర్మాత శ్రీ జి ఆదిశేషగిరి రావు 1971 ఆగస్టు 27 న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించి మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టిందని, నేటి యువ హీరోల చిత్రాలు కొన్ని దేశాల్లోనే విడుదలైనా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనట్లు ప్రచారం జరుపుకుంటూంటే, అప్పట్లోనే ‘మోసగాళ్లకు మోసగాడు’ 125 దేశాల్లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రాలలో ఆదరణకు మార్గదర్శకమైందని, 7 లక్షల రూపాయల భారీ బడ్జెట్ తో , కేవలం నెలరోజుల్లో షూటింగ్ జరుపుకోవటం ఒక ప్రయోగంగా చర్చనీయాంశమైందని , ‘ట్రెజరర్ హంట్’ పేరుతో ఆంగ్లంలోను, ‘గన్ ఫైటర్ జానీ’ గా హిందీలోను, ‘మోసక్కారనుక్కు మోసక్కారన్’ గా తమిళంలోనూ అనువాదమై, ప్రపంచవ్యాప్తంగా ఆదరణకు నోచుకోవటం మా సంస్థకు గర్వకారణం అన్నారు. రాజస్థాన్ లోని థార్ ఎడారి, బికనీర్ కోట తదితర ప్రదేశాల్లో యాక్షన్ దృశ్యాలను, టిబెట్, సిమ్లా తదితర అందమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ చేశామని, ఈ చిత్రం కృష్ణ గారు, నాగభూషణం గార్లకు మంచి పేరు తెచ్చిందనీ పేర్కొన్నారు. ఈ చిత్రం రకరకాల హాలీవుడ్ చిత్రాలు, నవలలు ఆధారంగా శ్రీ ఆరుద్ర కథ రచించగా, ఇప్పుడు ఈ అభిమాని శ్రీ విజయ్ రీ-మిక్స్ చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు.
శ్రీ విజయ్ తను హీరో కృష్ణ గారి అభిమానిగా, రచయితగా, ఈ రీ-మిక్స్ నవలా ప్రయోగం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఈ ప్రయత్నంలో తనను ఆశీర్వదించి ప్రోత్సహించిన పద్మాలయా సోదరులకు, నవలా రూపకల్పనలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రచయిత విజయ్ సతీమణి శ్రీమతి అనురాధ, కుమారుడు శ్రీ విక్రాంత్, సోదరుడు శ్రీ లక్ష్మీ నరసింహారావు, ప్రాణ స్నేహితుడు శ్రీ జయసూర్య, వారి సతీమణి శ్రీమతి లలిత, పద్మాలయా స్టూడియోస్ పి.ఆర్.ఓ. శ్రీ బాలాజీ శర్మ పాల్గొన్నారు.
ఈ నవల నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్, నవోదయ బుక్ హౌస్, నవ చేతన బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలలోనూ లభ్యం అవుతాయి.