సహజనటి జయసుధ.. నాటి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్ నుంచి చిరంజీవి, సుమన్‌ల సరసన కూడా నటించి మెప్పించింది. తన నటనతో సహజనటి అనే బిరుదును సొంతం చేసుకుని సార్ధక నామధేయురాలయ్యింది. ఈమె తన కెరీర్‌లో ఏనాడు శృతిమించి నటించిన దాఖలాలు లేవు. శ్రీదేవి, జయప్రద వంటి వారు గ్లామర్‌తో పేరు తెచ్చుకుంటే జయసుధ మాత్రం తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వయసు మీద పడిన దృష్ట్యా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తల్లి, వదిన వంటి పాత్రలు పోషిస్తోంది. పలువురు స్టార్స్ చిత్రాలలో తల్లి పాత్రలు కీలకం అయితే వారికి వెంటనే జయసుధ గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా ఈమె దిల్‌రాజు చిత్రాలలో మరచిపోలేని తల్లి పాత్రలు చేసింది. ప్రకాష్‌రాజ్ వంటి నటునితో పోటీ పడి నటించడం ఈమెకే సాధ్యం. కాగా ఇప్పటికే జయసుధ, మహేష్‌బాబుకి తల్లిగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మోత్సవం’ చిత్రాలలో నటించింది. తాజాగా మహేష్ 25వ ప్రతిష్టాత్మక చిత్రం, అందునా నిర్మాతల్లో ఒకరు అయిన దిల్‌రాజు బేనర్‌లో మరోసారి ‘మహర్షి’లో ఆమె మహేష్‌కి తల్లిపాత్రను పోషిస్తోంది.
తాజాగా ఆమె మాట్లాడుతూ, మహేష్, నేను హీరోయిన్‌గా నటించిన చిత్రాలలో బాలనటునిగా నటించాడు. అప్పటినుంచే మహేష్ నాకు తెలుసు. చాలామంచి వ్యక్తి. ఎంత పెద్దస్టార్ అయినా గర్వం ఉండదు. పెద్దలను గౌరవించడంతో పాటు ఎంతో మర్యాద ఇస్తారు. నిజాయితీగా మాట్లాడుతాడు. అతనితో నటిస్తున్న సమయంలో ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. విజయనిర్మల గారికి నేను బంధువు కావడంతో కృష్ణగారి కుటుంబంతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ అనుబంధం వల్లనే మహేష్‌ని ఎక్కువసార్లు కలవడం జరుగుతోంది. మహేష్ ఏ చిత్రం చేసినా, అది తన మొదటి చిత్రంగానే భావించి చేస్తూ ఉంటాడు. దర్శకుడు ఏది చెబితే అది చేసేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. దర్శకుడు ఎలా మలుచుకుంటే మహేష్ అలా మారిపోతాడు.
ఇక ‘మహర్షి’ చిత్రంలో మహేష్ నటన తారా స్థాయికి చేరింది. రెండు మూడు సీన్స్‌లో మహేష్‌తో కలిసి నేను నటించిన సన్నివేశాలలో ఆయన యాక్టింగ్ చూసి నేను ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం కూడా మర్చిపోయాను. ఆయన నా కంట తన నటనతో తడి పెట్టించాడు. మహేష్ యాక్టింగ్‌కి సెట్స్‌లోనే కన్నీరు పెట్టుకున్నాను. అంతలా పాత్రలో లీనమై నటించాడు. ‘మహర్షి’ చిత్రానికి గాను మహేష్‌కి అవార్డులు రావడం ఖాయమని చెప్పింది. మొత్తానికి ఎవరినీ సహజంగా పొగిడే పనిలేకుండా తన పాత్ర తాను చేసుకుపోయే జయసుధ ‘మహర్షి’ మహేష్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి అనే చెప్పాలి.