ప్రేక్షకుల అభిరుచిని పసిగట్టడం మన మేకర్స్‌కే కాదు.. ఎవ్వరితరం కాదనే చెప్పాలి. ఎప్పుడు ఏ హీరోకి స్టార్‌డమ్ వస్తుంది? ఇమేజ్ ఒక్కసారిగా స్కై లెవల్లోకి ఎప్పుడు దూసుకుపోతుందో చెప్పలేం. దీనికి నేచురల్‌స్టార్ నాని, రౌడీస్టార్ విజయ్ దేవరకొండలను ఉదాహరణగా చెప్పాలి, నటనపరంగా చూసుకుంటే విజయ్ కంటే నాని నాలుగాకులు ఎక్కువగానే చదివాడు. ఎలాంటి సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి హీరో అయ్యాడు. ఇక ఆయన నటనను ఒకనాటి కమల్‌హాసన్ నటనతో పోల్చవచ్చు. తన పాత్రలోకి పరకాయప్రవేశం చేయడంలో, మన పక్కింటి కుర్రాడిగా అనిపించడంలో, అద్భుతమైన నటన, కథల ఎంపికలో ఆయన స్టైలే వేరు.
కానీ విజయ్ దేవరకొండది ఆ పరిస్థితి కాదు. ఆయనకు కూడా ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేవు. అయినా ‘అర్జున్‌రెడ్డి’తో 40కోట్లు, ‘గీతాగోవిందం’తో 60కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. కేవలం యావరేజ్ సబ్జెక్ట్‌తో కూడా భారీ కలెక్షన్లు సాధించి, యావరేజ్ చిత్రాన్ని కూడా హిట్ స్థాయికి తీసుకుని పోయే ఘనతను విజయ్ అతి తక్కువ చిత్రాలతోనే సాధించాడు. ‘పెళ్లిచూపులు’, ‘మహానటి’లో కొంచెం సేపు మాత్రమే తెరపై కనిపించినా ఇవి కూడా భారీవసూళ్లు సాధిస్తున్నాయి. ఇక ‘గీతగోవిందం, ట్యాక్సీవాలా’ చిత్రాలు మరీ అద్భుతమైన సబ్జెక్ట్‌లు కాకపోయిన వాటితోనే మేజిక్ చేశాడు.
ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన నాని ‘జెర్సీ’ చిత్రం యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చిత్రాన్ని చూసి ఫిదా అయిపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి రివ్యూలు, మౌత్‌టాక్.. ఇలా అన్నింటా ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘జెర్సీ’ చిత్రం కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగిన విధంగా లేవు. స్లోగా షోలు ఫుల్ అవుతున్నాయే గానీ ముందస్తు టిక్కెట్ల విషయంలో మాత్రం పెద్ద ఊపులేదు. అదే విజయ్‌దేవరకొండ వంటి వారి చేతిలో ఈ చిత్రం పడివుంటే మూడు వారాల పాటు థియేటర్లు కిటకిటలాడేవి అని అంటున్నారు. వాస్తవానికి ‘జెర్సీ’ టాక్ రీత్యా చూసుకుంటే ఈ చిత్రం 40కోట్లను వసూలు చేయాల్సివుంటుంది.
కానీ మొదటివీకెండ్ తర్వాత ఈ జోరు బాగా తగ్గింది. థియేటికల్ బిజినెస్ బాగా జరిగిన నేపథ్యంలో సినిమా సేఫ్ అవ్వాలంటే 40కోట్లు తప్పనిసరిగా రాబట్టాలి. కానీ మరోవైపు ‘అవేంజర్స్ ఎండ్‌గేమ్’ రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఏదిఏమైనా నటనలో నానినే బెస్ట్ అయిన కలెక్షన్లు రాబట్టడంలో, ఇమేజ్ దృష్ట్యా చూసుకుంటే నేచురల్ స్టార్ నాని కంటే విజయ్‌దేవరకొండ ఊపు అధికంగా ఉందనేది సత్యం.