నేటిరోజుల్లో హీరోలు పది, ఇరవై, ఇరవై అయిదు వంటి చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కారణం పాత కాలం నాటి స్టార్స్‌లా కనీసం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలాగా సెంచరీకి కూడా తాము చేరలేమని వారికి తెలుసు. ఇక విషయానికి వస్తే ‘భరత్ అనే నేను’ తర్వాత ఏడాది గ్యాప్, అందునా తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం, వంశీపైడిపల్లి వంటి టాలెంటెడ్ డైరెక్టర్, కోట్లను నీళ్లలా ఖర్చుపెట్టే ముగ్గురు అంటే దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిల వంటి నిర్మాతలు... ఇది ‘మహర్షి’ ముందున్న కథ. ఇప్పటికే టీజర్, నాలుగు ఆడియో సింగిల్స్ విడుదలయ్యాయి. వీటిలో కనీసం ‘భరత్ అనే నేను’లా దేవిశ్రీ ట్యూన్స్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు.
తాజాగా విడుదలైన ‘పదరా పదరా’ మాత్రం రైతులకు స్ఫూర్తిదాయంకంగా ఉంది. తువాలు తలకి చుట్టుకుని నాగలి చేతబట్టి ఎద్దులతో పొలం దున్నుతున్న మోడ్రన్ రైతు గెటప్ చూస్తే మరలా శ్రీమంతుడు గుర్తుకు రాకమానదు. మరోవైపు ఈ ట్యూన్ ‘భరత్ అనే నేను’లోని ‘జాగో.. జాగో’ తరహాలో ఉంది. అయినా మొత్తానికి మహేష్ టీం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని మహేష్ 25వ చిత్రం కాబట్టి ఆయన కెరీర్‌లోనే నిలిచిపోయేలా ఎల్బీస్టేడియంలో చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఎలక్షన్లు జరిగిన ఈవీఎంలు, భద్రత వల్ల ఆ వెన్యూ వీలుకాలేదు. చివరకు హైదరాబాద్ నెక్లేస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ వేడుకను మే1న అంటే మేడే రోజున జరపాలని భావిస్తున్నారట. మేడే అంటే ఎలాగూ సెలవు కాబట్టి అభిమానుల సందడికి అడ్డు ఉండదు.
మరోవైపు మామూలుగా మహేష్ సినీ వేడుకల్లో రెగ్యులర్‌గా కనిపించే ఆయన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ముఖ్య అతిధి అనేది ఖాయం. మిగిలిన ముఖ్య అతిధులు ఎవరో మాత్రం సస్పెన్స్‌ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ నటించిన 24 చిత్రాల దర్శకనిర్మాతలను ఈ వేడుకకు స్పెషల్‌గెస్ట్‌లుగా పిలవనున్నారట. ఇదే జరిగితే మహేష్‌తో పాటు ఆయన కెరీర్‌కి అంచెలంచెలుగా సాయం చేసిన దర్శకనిర్మాతలను ఒకే వేదికపై చూసే భాగ్యం కలుగుతుంది. అదే సమయంలో ఓ హీరో ప్రస్థానంలో దర్శకనిర్మాతల ప్రాముఖ్యతను మహేష్ మరోసారి సభా వేదిక మీదుగా గౌరవించినట్లుగా ఉంటుంది. ఈ విషయంలో మహేష్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని చెప్పాలి. మరి మహేష్‌తో పాటు ఆయన సమకాలీకులైన స్టార్స్ కూడా ఈ ఈవెంట్‌కు రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.