చాలామంది నవతరం దర్శకులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఏకంగా మొదటి చిత్రమే స్టార్స్‌తో తీయాలని కలలుగంటు ఉంటారు. చిన్నచిన్న హీరోలతో అవకాశం వచ్చినా వద్దని తప్పు చేస్తూ ఉంటారు. కానీ హీరో ఎవరైనా సరే మొదటి చిత్రంతోనే తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటే.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతారు. అంతేగానీ వక్కంతం వంశీలాగా ఏదో అదృష్టం బాగుండి అల్లుఅర్జున్ వంటివారిని ఒప్పించినా, సినిమా ఫట్ అయితే రెంటికి చెడ్డరేవడిగా మిగులుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తొలి చిత్రం నాడు కాస్త ఇమేజ్ ఉన్న తరుణ్‌తో చేసినా రెండో చిత్రానికే మహేష్‌తో చాన్స్ దక్కించుకుని మరలా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు.
‘చిలసౌ’లో సుశాంత్‌ను పెట్టి తీసిన రాహుల్ రవీంద్రన్ రెండో చిత్రానికే నాగార్జునని మెప్పించి ఏకంగా ‘మన్మథుడు 2’ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి మొదటి చిత్రం కూడా ‘పటాస్’తో కళ్యాణ్‌రామ్‌తోనే. కానీ ‘ఎఫ్2’తో ఆయన ఇక కళ్యాణ్‌రామ్ అందుకోలేని స్థాయికి ఎదిగి నేడు మహేష్‌బాబుతో చిత్రం చేస్తూ ఉండటం విశేషం.
తాజాగా గౌతమ్‌తిన్ననూరి ఫేడవుట్ అయిన సుమంత్‌తో చాన్స్ వస్తే ఆయనతో ‘మళ్లీరావా’ చిత్రం తీసి రెండో చిత్రంతోనే నానిని క్లీన్‌బోల్డ్ చేసి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని మెప్పించి ‘జెర్సీ’తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన మీద దిల్‌రాజు కన్నేశాడని ప్రచారం సాగుతోంది. వరుణ్‌తేజ్, ఎన్టీఆర్, చరణ్ వంటి వారికి కథలు వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి హీరో ఎవరు అనేది పక్కనపెట్టి సరైన కథ, కంటెంట్‌తో వైవిధ్యభరితమైన కథనంతో ప్రేక్షకులను మెప్పిస్తే వారి ప్రతిభను గుర్తించడానికి ప్రేక్షకులు, స్టార్స్, ఇతర నిర్మాతలు సిద్దంగా ఉంటారు. కానీ మొదటి చిత్రమే కొండ మీద కోతి దిగిరావాలని భీష్మించుకుని కూర్చుంటే ఏళ్లకు ఏళ్లు గోళ్లుగిల్లుకోకతప్పదనేది వాస్తవం.