ఒక సినిమాకి డేట్స్ ఇవ్వటం.. షూటింగ్ చేసి, డబ్బింగ్ చెప్పేశాక.. ఒకటో రెండో ఇంటర్వ్యూలు.. ప్రీరిలీజ్ ఫంక్షన్ చేసేస్తే పనయిపోతుంది అనుకుంటున్న చాలా మంది హీరోలు నిఖిల్‌ని చూసి మారాలి. ఈ రోజుల్లో సినిమా తీయటం కంటే రిలీజ్ చేయటం చాలా కష్టం. అంతకంటే ప్రేక్షకుడికి సినిమాని రీచ్ చేయటం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. గతంలో ఒక చిత్రం విడుదలయ్యాక మౌత్ టాక్‌తో రెండవ వారం, మూడవ వారంలో స్టడీగా వెళ్ళి 50 రోజులు.. 100 రోజులు ఆడేవి. కానీ సినిమా కాలమానం చాలా చిన్నదయ్యింది. తెలుగు సినిమా భవిష్యత్తు ఒక వీకెండ్ మాత్రమే అంటే కేవలం మూడు రోజులు అన్నమాట. ఈ మూడు రోజులు ఎంత పిండుకునేవాడికి అంతే.
ప్రేక్షకుడికి ఒకప్పుడు సినిమానే ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పడు సినిమా కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆప్షన్‌గా మారింది. ఇలాంటి టైంలో మొదటి రోజు మొదటి ఆట ఫుల్ చేసుకోకపోతే ఆ వీకెండ్ అంతా పోయినట్టే.. ఇదిలా ఉంటే సినిమా చేసేశాము ప్రమోషన్ నిర్మాత బాధ్యత నాకెందుకు అనుకుంటున్నారు చాలా మంది హీరోలు. వీరందరికి పూర్తి భిన్నంగా నిఖిల్ ఆలోచిస్తాడు. తను చేసే చిత్రాల వల్ల అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఎవరూ నష్టపోకూడదు అనే మైండ్ సెట్‌తో పనిచేస్తాడు. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్ పార్టీ వంటి చిత్రాలకి తన స్టైల్‌లో ప్రమోషన్ చేశాడు.
ఇప్పడు తాజాగా తను నటించిన ‘అర్జున్ సురవరం’ చిత్రం మే 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్‌గా నిఖిల్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ రియల్ రిపోర్టర్ అనిపించేలా మారి తన సినిమాని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నాడు. అంతే కాదు త్వరలో రీసెంట్ ఎలక్షన్స్‌లో అందర్నీ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసిన ఓక లీడర్‌ని ఇంటర్వ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా తను తన సినిమాకి రిలేటెడ్‌గా ప్రమోట్ చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.