సాధారణంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి కథ డిమాండ్ చేస్తేనే ఉంటాయి. కానీ నేటి రోజుల్లో వాటిని ప్రతి చిత్రంలోనూ బెటర్ అవుట్‌పుట్ కోసం వాడుతూనే ఉన్నారు. ‘బాహుబలి’ తర్వాత తాను చేయబోయే తదుపరి చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకుంటానని, మగధీర, ఈగ, బాహుబలితో బోర్ కొట్టిందని రాజమౌళి చెప్పాడు. అదే డైరెక్టర్ తదుపరి తాను తీస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కోసం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వాడుతున్నాడు. ఇక ‘స్పైడర్’ వంటి చిత్రాలకు ఇలాంటి హంగులు ఉండాలి గానీ ‘మహర్షి’వంటి సామాజిక చిత్రానికి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లతో పనేంటి? అనే అనుమానం చాలా మందికి వస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ నుంచి మేకి వాయిదా పడటానికి కారణం ఇవేనని చెప్పారు.
ఇక ఈ ఏడాది సంక్రాంతి తర్వాత వస్తోన్న టాప్ స్టార్ చిత్రం ‘మహర్షి’ మాత్రమే. టాప్‌లీగ్‌లో వస్తున్న ఈ చిత్రానికి ముందు వచ్చినవన్నీ కేవలం మీడియం, లో బడ్జెట్ చిత్రాలు మాత్రమే. దాంతో ఈ లోటును ‘మహర్షి’ బాగా వర్కౌట్ చేస్తుందనే ఆశలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం మహేష్‌కి 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడం మరో విశేషం. అందునా దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి వంటి భారీ సంస్థలు ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ రెండు మూడు డిఫరెంట్ యాంగిల్స్‌లో గెటప్స్‌లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ తన చిత్రాలలో కొరటాల శివలాగా ఏదో ఒక మెసేజ్ ఉండేందుకు ఇష్టపడుతున్నాడని అర్ధమవుతోంది. మరి అలాంటిది ఫారిన్‌లో కోట్లకు అధిపతి అయిన వ్యాపారవేత్తగా, నిరుద్యోగిగా, స్నేహితుని కోసం విదేశాల నుంచి మన దేశానికి వచ్చి గ్రామాలలో రైతుల కోసం పోరాడే యోధుడుగా మహేష్ పాత్ర ఉంటుందిట.
ఇక ఇందులో అల్లరి నరేష్ మహేష్ స్నేహితునిగా మధ్యలోనే చనిపోతాడని కొందరు అంటుంటే. ఆయన కథ సుఖాంతమే అవుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఇందులో 1995కృష్ణ, గోదావరి బేసిన్‌కి సంబంధించి గ్యాస్ పైప్‌లైన్ తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద బ్లాస్ట్ అయి గ్యాస్‌లీక్ అయింది. ఈ ఉదంతం సినిమాలో కీలకమలుపుకు కారణమవుతుందని అంటున్నారు. ఈ పాయింటే మహేష్ ఇండియాకి రావడానికి కారణమని తెలుస్తోంది. దీనిని గ్రాఫిక్స్, వీఎఫ్‌క్స్ ఎఫెక్ట్స్‌తో చిత్రీకరించారట. మరి ఈ పాయింట్‌ని వంశీపైడిపల్లి ఎలా రాసుకున్నాడు? ఆనిని తన కథలో ఎలా ఇమిడ్చాడు? అనేది చూడాలంటే మే9 వరకు వెయిట్ చేయకతప్పదు.