జయాపజయాలు సహజం. అందునా సినిమా ఫీల్డ్‌లో అవి వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. ఇక విషయానికి వస్తే జయాపజయాలకు అతీతులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో క్రియేటివ్ జీనియస్ మణిరత్నంని ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇటీవల ఆయన కూడా ‘ఓకే బంగారం, నవాబ్’ చిత్రాలతో తన స్థాయి చిత్రాలు తీయకపోయినా తాను మరలా గాడిలో పడ్డానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన వందల బడ్జెట్ ‘పొన్నియన్ సెల్వం’ అనే ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో విక్రమ్- జయం రవి- అమితాబ్‌బచ్చన్- మోహన్‌బాబు వంటి మహామహులు నటిస్తున్నారు. ఈ చిత్రం స్టోరీ తయారైనప్పుడు మొదటగా హీరోయిన్ పాత్రకి మణి అనుష్కనే అనుకున్నాడట.
కానీ ‘బాహుబలి’ మేనియా ఇంకా ఉన్నందువల్ల ఆ ప్రభావం తన చిత్రంపై పడుతుందనే ఉద్దేశ్యంతో ఆయన నయనతారను తీసుకున్నాడు. అందునా నయన ఉందంటే తమిళంలో మంచి క్రేజ్ వస్తుంది. కానీ నయన ప్రస్తుతం రజనీకాంత్-మురుగదాస్‌ల ‘దర్బార్’, విజయ్ 63వ చిత్రం ‘సైరా’ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. దాంతో మణిరత్నం అడిగిన బల్క్‌డేట్స్‌ని ఆమె అడ్జస్ట్ చేయలేకపోయిందట. దాంతో ఈ పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా నేరుగా మరలా స్వీటీ వద్దకే వెళ్లిందని సమాచారం. అనుష్క ‘భాగమతి’ చిత్రం తర్వాత మరో చిత్రానికి ఓకే చెప్పలేదు. కేవలం కోన వెంకట్ నిర్మాతగా, రచయితగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి మాత్రమే ఓకే చెప్పింది.
స్వీటీ అంటే తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజే ఉంది. అందునా ‘బాహుబలి’ తర్వాత ఆమె రేంజ్ ఆసాంతం దేశవ్యాప్తంగా వ్యాపించింది. మరి స్వీటీకి మణిసార్ చిత్రంలో నటించడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఏ హీరోయిన్ అయినా తన కెరీర్‌లో ఒక్కసారైనా మణి చిత్రంలో నటించాలని భావిస్తుంది. అది అనుష్కకి కెరీర్ చరమాంకంలో వచ్చిందనే చెప్పాలి. మరి దీనిని ఆమె ఎలా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది....!