హాలీవుడ్ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు ఎలాంటివో మన దేశానికి చెందిన జాతీయ అవార్డులు మనకి ఆస్కార్‌తో సమానం. మీకు ఇప్పటివరకు ఆస్కార్ రాలేదని బాధగా ఉందా? అన్న ప్రశ్నకు లోకనాయకుడు కమల్‌హాసన్ చెప్పిన సమాధానం ఇది. అవార్డుల విషయంలో ఆస్కార్‌కి ఎంత గొప్పపేరు ఉందో మనదేశంలో జాతీయ అవార్డులకు అంతే గౌరవం ఉంది. ఇక కిందటి ఏడాది మన తెలుగు చిత్రం ‘శతమానంభవతి’కి జాతీయ పురస్కారం లభించింది. తాజాగా మరికొన్ని రోజుల్లో మన జాతీయ అవార్డులు ప్రకటించనున్నారు. మే నెలలో ఈ వేడుక ఉండవచ్చని సమాచారం.
కిందటిసారి ‘శతమానం భవతి’లానే ఈ ఏడాది కూడా తెలుగు చిత్రాల నుంచి భారీ పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా రెండు చిత్రాల మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ నెలకొని ఉంది. అవే రామ్‌చరణ్-సుకుమార్‌ల దర్శకత్వంలో వచ్చి ‘నాన్‌బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టిన ‘రంగస్థలం’ ఒకటి కాగా, మహానటి సావిత్రి బయోపిక్‌గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ కుమార్తెలు నిర్మించిన ‘మహానటి’ చిత్రం రెండోది. ఈ రెండు చిత్రాలలోనూ రామ్‌చరణ్, కీర్తిసురేష్‌లు తమ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు.. ఆయా పాత్రల్లో మరెవ్వరినీ ఊహించని రీతిలో చేశారు. దీంతో ఈ సారి జాతీయ అవార్డులకు ఈ రెండు చిత్రాల మధ్యనే గట్టి పోటీ అని అంటున్నారు.
మరోవైపు జ్యూరీ పరుశురాం దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ, రష్మికా మండన్న నటించిన ‘గీతాగోవిందం’, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలసౌ’లను కూడా ఎంపిక చేసింది. నిజానికి ‘గీతాగోవిందం’ అద్భుతమైన కథ కలిగిన చిత్రం ఏమీ కాదు. చిన్న స్పర్థల వల్ల విభేదాలు వచ్చిన జంట మరలా ప్రేమలో పడి ఎలా దగ్గరైంది అనే పాయింట్‌ని పరుశురాం యూత్‌కి నచ్చేలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పి కోట్లు వసూలు అయ్యేలా చేశాడు.
ఇక ‘చిలసౌ’ విషయానికి వస్తే ఒక రాత్రిని పాయింట్‌గా తీసుకుని దానికి పెళ్లిచూపులకు కనెక్ట్ చేస్తూ వచ్చిన ‘చిలసౌ’కి కూడా ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డులకు ఈ రెండు చిత్రాలను ఎంపిక చేయడం తప్పు కాదు గానీ ఫైనల్ పోటీ మాత్రం చరణ్, కీర్తిల మద్యనే ఉంటుందనేది వాస్తవం. మరి సస్పెన్స్ తొలగాలంటే అప్పటివరకు వెయిట్ చేయకతప్పదు.