ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. మే 23న జరగబోయే కౌంటింగ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ముగ్గురు నటీనటులపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్‌కళ్యాణ్ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కానీ జనసైనికులు మాత్రం ఏదో అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే సర్వేల ప్రకారం చూసుకుంటే జనసేన సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యే చాన్స్ ఉంది. ఓట్లశాతం పరంగా పవన్ కీలకంగా మారినా, గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. టిడిపి, వైసీపీ ఇద్దరు పూర్తి మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోతే మాత్రం పవన్ కీలకంగా మారుతాడు.
మరోవైపు వచ్చే ఎన్నికల వరకు పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఆయన ‘అజ్ఞాతవాసి’ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితం అయినా మైత్రి మూవీ మేకర్స్, ఎ.యం.రత్నం వంటి వారి కమిట్‌మెంట్స్ ఉన్నాయి. వారు అడ్వాన్స్‌లు కూడా తిరిగి తీసుకోకుండా పవన్‌కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మరల సినీ రీఎంట్రీ ఇస్తాడా? లేదా అనేది వేచిచూడాలి.
ఇక మెగాబ్రదర్ నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేశాడు. ఆయన గెలిచినా ఓడినా ‘జబర్ధస్త్’లో పాల్గొనేందుకు వచ్చిన అడ్డంకి ఏమీ లేదు. ఇక రోజా విషయానికి వస్తే వైసీపీ వారు ఇప్పుడే గాలిలో మేడలు కడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని, రోజా నగరిలో గెలిస్తే హోం లేదా స్త్రీ శిశుసంక్షేమ శాఖమంత్రి కావడం ఖాయమంటున్నారు. ఇదంతా ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగంగా ఉంది.
అయితే వైసీపీ అనుకున్నదే జరిగి అధికారంలోకి వచ్చి, అదే సమయంలో రోజా నగరి నుంచి గెలిచి మంత్రి అయితే మాత్రం ఇక ఆమె ‘జబర్ధస్త్’కి పూర్తిగా దూరం కాకతప్పదనే చెప్పాలి. మరి ఏ విషయం తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయాలి!