పిల్లికి చెలగాటం.. ఎలుకకి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో.. నిర్మాతలకు టెన్షన్.. ప్రేక్షకులకు మాత్రం ఆసక్తి అనేది నిజమవ్వబోతోంది. ఇక విషయానికి వస్తే గతంలో బాపయ్య, మురళీమోహన్‌రావు, రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్ వంటి ఎందరో బాలీవుడ్ చిత్రాలు తీశారు. కానీ వాటిల్లో ఎక్కువ టాలీవుడ్ హిట్ సినిమాలకు రీమేక్‌లు మాత్రమే. అయితే తెలుగు దర్శకుల సత్తా బాలీవుడ్‌లో రుచిచూపించిన దర్శకుడు మాత్రం వర్మనే. ఆయన గత కొన్ని చిత్రాలు బాగా ఆడకపోయి ఉండవచ్చుగానీ ఆయనకు ఇప్పటికీ బాలీవుడ్‌లో ఓ బ్రాండ్‌నేమ్ ఉంది. ఇక క్రిష్ ‘ఠాగూర్’(రమణ)కి రీమేక్‌గా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’, ‘మణికర్ణిక’ చిత్రాలు తీశాడు. ‘గబ్బర్’ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక ‘మణికర్ణిక’ డైరెక్టర్స్ క్రెడిట్‌లో జరిగిన సంఘటనలు, సంచనాలు, వివాదాలు అందరికీ తెలిసిందే.
ఇక విషయానికి వస్తే జూన్ 21వ తేదీన బాలీవుడ్‌లో ఓ అరుదైన ఘటన ఆవిష్కృతం కాబోతోంది. తెలుగులో మోడ్రన్‌క్లాసిక్‌గా మొదటి చిత్రం ‘అర్జున్‌రెడ్డి’తోనే సందీప్‌రెడ్డి వంగా సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్‌కి కూడా ఇతనే దర్శకత్వం వహిస్తూ ఉండటం విశేషం. ఇందులో షాహిద్‌కపూర్, కియారా అద్వానీలు నటిస్తున్నారు. ఈ మూవీకి ఇప్పటికే యమా క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ పలు సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ చిత్రంపై హైప్ బాగా పెరిగింది. ఇక రెండో చిత్రం ‘మెంటల్ హై క్యా’. ఇందులో కంగనారౌనత్, రాజ్‌కుమార్‌రావులు నటిస్తున్నారు. ‘మణికర్ణిక’ వంటి భారీ చిత్రం తర్వాత ఆమె ఈ చిత్రంపై భారీ నమ్మకాలు పెట్టుకుని ఉంది. బాలీవుడ్‌లో క్వీన్‌గా వెలుగొందుతున్న కంగనారౌనత్, రాజ్‌కుమార్‌రావులు ఇద్దరు మంచి ఆర్టిస్టులే. ఇక ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్‌రెడ్డి వంగా తీసింది ఒక్క చిత్రమే అయినా అది బ్లాక్‌బస్టర్.
అదే ప్రకాష్ కోవెలమూడి విషయానికి వస్తే ఆయన తెలుగులో ‘బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్‌జీరో’ వంటి మూడు చిత్రాలు తీసినా దక్కాల్సిన విజయం దక్కలేదు. దాంతో ఈయన ఈసారి బాలీవుడ్‌లో జెండా పాతాలని చూస్తున్నాడు. వాస్తవానికి జూన్21న ‘కబీర్‌సింగ్’ విడుదల ముందుగా ఖరారు చేశారు. కానీ ‘మెంటల్ హై క్యా’ మూడునాలుగు సార్లు వాయిదాపడి జూన్21న రానుంది. మరి ఈ బిగ్‌ఫైట్‌లో విజయం సాధించే టాలీవుడ్ డైరెక్టర్ ఎవరు? అనేది ఆసక్తిని కలిగించే విషయం. సందీప్, ప్రకాష్‌లు బాలీవుడ్‌లో హిట్స్ కొడితే టాలీవుడ్‌లో కూడా వారికి భారీ ఆఫర్లు, ముఖ్యంగా సందీప్‌రెడ్డి వంగాకి మహేష్‌తో చాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని వారు ఎలా సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాలి...!